నేటి నుంచి మెగా రైతు మేళా
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:55 AM
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేటలో శనివారం నుంచి మూడు రోజుల పాటు మెగా రైతు మేళా నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో 3 రోజుల పాటు నిర్వహణ..
సీఎం చేతులమీదుగా నేడు ప్రారంభం
9న సీఎం బహిరంగ సభ:తుమ్మల
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేటలో శనివారం నుంచి మూడు రోజుల పాటు మెగా రైతు మేళా నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను పరిచయం చేయడమే ఈ మేళా లక్ష్యమని మంత్రి వివరించారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఈ రైతుమేళాను సీఎం రేవంత్ శనివారం ప్రారంభిస్తారని తెలిపారు.
ప్రారంభోత్సవం అనంతరం రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి చర్చిస్తారని వివరించారు. అలాగే, ఈనెల 8 తేదీ, ఆదివారం హకీంపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారని, అనంతరం వివిధ అభివృద్థి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. నవంబరు 9న పది జిల్లాలకు చెందిన సుమారు 50 వేల మంది రైతులు పాల్గొనే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని తుమ్మల వెల్లడించారు. ఇక, మెగా రైతు మేళాలో ఏర్పాటు చేస్తున్న 150 ప్రదర్శన స్టాళ్ల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, నూతన సాగు పద్థతులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని మంత్రి తెలిపారు.
రైతులా వెళ్లి తుపాను నష్టం గురించి తెలుసుకున్న మంత్రి తుమ్మల
దమ్మపేట, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్‌ని పక్కనపెట్టి.. కర్ర చేతపట్టుకుని తన అనుచరుడి బైకుపై సాధారణ రైతులా వెళ్లి తుపాను బాధిత రైతులతో మాట్లాడారు. ఇటీవలి మురసు తుపాను కారణంగా భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో... ఆయన శుక్రవారం ఉదయం దమ్మపేట మండలం గండుగులపల్లి పరిసరాల్లోని పొలాలకు వెళ్లారు. ద్విచక్రవాహనంపై తిరుగుతూ తుపాను, మల్లెపూల వాగు ఉధృతి కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నష్టం వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News