బాలికతో శృంగారం.. ఎమ్మెల్సీ రహ్మత్‌పై వేటు
ABN , Publish Date - Aug 30 , 2026 | 05:45 AM
శాసనమండలి సభ్యుడు మీర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మజ్లిస్ ప్రకటించింది. తక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆయన్ను ఆదేశించింది.
పార్టీ నుంచి బహిష్కరించిన మజ్లిస్
ఎమ్మెల్సీకీ రాజీనామా చేయాలని ఆదేశం
తమకెలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసుల వెల్లడి
ఘటనలో మజ్లి్‌సకే చెందిన ఓ ఎమ్మెల్యే,
మరో కార్పొరేటర్ హస్తం కూడా ఉందని ఆరోపణలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): శాసనమండలి సభ్యుడు మీర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మజ్లిస్ ప్రకటించింది. తక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆయన్ను ఆదేశించింది. ఈ మేరకు ఆ పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అత్తాపూర్‌లో ఒక బాలికతో మీర్జా రహ్మత్ బేగ్ శృంగారం చేస్తుండగా, స్థానికులు గమనించి చితకబాదారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే రహ్మత్ బేగ్ హుటాహుటిన ఉమ్రాకు వెళ్లినట్లు సమాచారం. ఈ వీడియోను కొందరు నాయకులు మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి పంపించగా... ఆయన పార్టీ వర్గాలతో విచారణ చేయించినట్లు తెలుస్తోంది. విచారణలో మీర్జా రహ్మత్ బేగ్ అనుచిత చర్యలకు పాల్పడ్డారని తేలడంతో రహ్మత్ బేగ్‌ను ఉమ్రా నుంచి వెనక్కి పిలిపించారు. పార్టీ నుంచి బహిష్కరించి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన మీర్జా రహ్మత్‌బేగ్ 2023లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికవగా, ఆయన పదవీకాలం 2029 వరకు ఉంది. చార్మినార్ మాజీ ఎమ్మెల్యే అహ్యద్ పాషా ఖాద్రీ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన మీర్జా రహ్మత్ బేగ్.. అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అభ్యర్థిగా మజ్లిస్ తరఫున పోటీ చేశారు. దూకుడు కలిగిన నేతగా గుర్తింపు పొందిన బేగ్... భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేసేవారన్న ఫిర్యాదులు సైతం ఉన్నాయి. మీర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించి, పదవికి రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ అయినా.. ఆ విషయం గురించి పార్టీ నాయకులు ఎక్కడా నోరు విప్పడం లేదు. కాగా, ఘటనకు సంబంధించి బేగ్‌తో పాటు పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ కార్పొరేటర్‌పైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బాలిక పట్ల ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అసభ్యంగా ప్రవర్తించారంటూ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ సీతయ్య తెలిపారు. మీర్జా రహ్మత్ బేగ్‌పై కొందరు దాడి చేశారన్న ప్రచారం గురించి ప్రశ్నించగా.. తనకు తెలియదని జవాబు ఇచ్చారు.
రకరకాలుగా ఊహాగానాలు
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిసీ రహ్మత్‌బేగ్‌ను కాపాడేందుకు మజ్లిస్ అధిష్ఠానం ఉమ్రాకు పంపిందని, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కారణం చెప్పకుండా పార్టీ నుంచి తొలగించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు హిమాయత్‌నగర్‌లో ఓ భూవివాదానికి సంబంధించి రహ్మత్ బేగ్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని, అందుకే పార్టీ నుంచి బహిష్కరించారని చెప్పుకొంటున్నారు. లండన్‌లో జరిగిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి సంబంధించినవీడియోలు బయటకు రావడంలో మీర్జా పాత్ర ఉందని, బహిష్కరణకు ఇదీ ఓ కారణమన్న వాదన వినిపిస్తోంది.
అసదుద్దీన్ సమాధానం చెప్పాలి
రహ్మత్ బేగ్‌ను మజ్లిస్ నుంచి ఎందుకు బహిష్కరించారో అసదుద్దీన్ చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సోషల్‌మీడియాలో మీర్జారహ్మత్ బేగ్ గురించి వస్తున్న వీడియోలు నిజమా? కాదా? అనేది అసదుద్దీన్ చెప్పాలని శివసేన తెలంగాణ అధ్యక్షుడు శివాజీ డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఒవైసీ.. వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సూచించారు.
ఇవీ చదవండి:
kumaram bheem asifabad- బాలికల భద్రతకు భరోసా
Read Latest Telangana News And AP News And National News
And Telugu News