Share News

తాతా మధు, నవీన్‌రెడ్డిపై మండలి ఎథిక్స్‌ కమిటీ విచారణ షురూ

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:34 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌ రెడ్డిలపై చర్యలకు సంబంధించి శాసనమండలి ఎథిక్స్‌ కమిటీ విచారణను ప్రారంభించింది.

తాతా మధు, నవీన్‌రెడ్డిపై మండలి ఎథిక్స్‌ కమిటీ  విచారణ షురూ
Mahesh Kumar Goud

  • అసెంబ్లీ తీర్మానం,
    సభ్యుల ఫిర్యాదులు పరిశీలించిన కమిటీ

  • సమగ్ర నివేదిక ఇవ్వండి

  • అధికారులకు కమిటీ చైర్మన్‌

  • మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచన

హైదరాబాద్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌ రెడ్డిలపై చర్యలకు సంబంధించి శాసనమండలి ఎథిక్స్‌ కమిటీ విచారణను ప్రారంభించింది. చైర్మన్‌ మహేశ్‌ గౌడ్‌ అధ్యక్షతన మండలి కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం నాడు కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ సభ్యులు దేశపతి శ్రీనివాస్‌ (బీఆర్‌ఎస్‌), నెల్లికంటి సత్యం (సీపీఐ), శాసనమండలి కార్యదర్శి నర్సింహాచారి, డిప్యూటీ కార్యదర్శి ఉపేందర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరో ఇద్దరు సభ్యులు కూచికుళ్ల దామోదర్‌ రెడ్డి, సీహెచ్‌ అంజిరెడ్డి హాజరు కాలేకపోయారు. తాతా మధు, నవీన్‌ రెడ్డిలపై చర్యలకు సంబంధించి శాసనసభ మంగళవారం ఆమోదించిన తీర్మానాన్ని, వారిద్దరిపై కాంగ్రెస్‌ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులు, ఆధారాలను కమిటీ పరిశీలించింది. అయితే ఈ సమావేశంలో దేశపతి శ్రీనివాస్‌ తన అభ్యంతరాలను తెలిపారు. తాతా మధు వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా వచ్చినవి కావంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో సభ్యుడు నెల్లికంటి సత్యం మాత్రం దళితవర్గానికి చెందిన స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు.. సీరియ్‌సగా తీసుకోవాల్సిన అంశమేనన్నారు. మహిళా సభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విచారణ జరగాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తాతా మధు, నవీన్‌ రెడ్డిలపై ఫిర్యాదు చేస్తూ ఇచ్చిన ఆధారాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వచ్చే సమావేశం నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు మహేశ్‌గౌడ్‌ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మూసీ ప్రాజెక్టుకు.. దసరా ముహూర్తం!

తక్షణమే పీఆర్సీ నివేదిక

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 05:34 AM