Share News

కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు మద్దతు ఇవ్వండి: బంజారాలకు కేటీఆర్ పిలుపు

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:40 PM

రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. ఇక కాంగ్రెస్, సీపీఐ పార్టీలు అలయన్స్‌లో ఉన్నాయని చెప్పారు.

కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు మద్దతు ఇవ్వండి: బంజారాలకు కేటీఆర్ పిలుపు
BRS Working President KTR

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మాజీ సీఎం కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతుగా నిలవాలంటూ బంజారాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సేవాలాల్ బంజారా భవన్‌‌ను బంజారాహిల్స్‌లో నిర్మించారని గుర్తు చేశారు.

ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బంజారాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకే రోజు నాలుగున్నర లక్షల ఎకరాలకు సంబంధించి గిరిజనులకు పోడు పట్టాలు అందించిన ఘనత కేసీఆర్‌దే అని తెలిపారు. మా తండాలో మా రాజ్యం ఉండాలన్న లాంబాడాల ఆత్మగౌరవాన్ని నిజం చేసింది బీఆర్ఎస్ అధినేత అని గుర్తు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందీ కేసీఆర్ అని చెప్పారు.


ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. ఇక కాంగ్రెస్, సీపీఐ పార్టీలు అలయన్స్‌లో ఉన్నాయని.. సింగరేణి దోపిడీని అరికట్టడానికి తాను సీపీఐకి మద్దతు ఇస్తానన్నారు. సింగరేణిలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. సీపీఐపైన ఏ ఒత్తిళ్లు వచ్చి కొత్తగూడెంలో కాంగ్రెస్‌తో పొత్తుకు ఒప్పుకుందో తనకు తెలియదని పేర్కొన్నారు.


ఎవరు కలిసొచ్చినా, రాకున్నా తాము సింగరేణి అవినీతిపై పోరాటం చేస్తామని కుండబద్దలు కొట్టారు. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తోందంటూ మండిపడ్డారు. తమ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని.. మరికొన్ని చోట్ల కిడ్నాప్ సైతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉన్న అంచనా మేరకు హంగ్ మున్సిపాలిటీల్లో 10 వరకు బీఆర్ఎస్‌కు రావచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే: పొన్నం ప్రభాకర్

For TG News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 02:46 PM