Share News

నిరుద్యోగులను నమ్మించి నయవంచన.. రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:25 PM

తెలంగాణ నిరుద్యోగులను సీఎం రేవంత్ నమ్మించి నయవంచన చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోందని అన్నారు.

నిరుద్యోగులను నమ్మించి నయవంచన.. రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
Former Minister KTR

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి కేటీఆర్‌ (Former Minister KTR) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అన్నారు. మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి యువత ఛీకొడుతోందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలని హామీ అని చెప్పి... ఇప్పుడు ఐదేళ్ల హామీ అంటూ మాటమార్చారంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్ పోస్టు చేశారు.


కేటీఆర్ ట్వీట్..

మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అడ్డదారిలో రేవంత్ గద్దె ఎక్కారన్నారు. ఇప్పుడు అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్‌తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి సీఎం ఫోటోలకు ఫోజు కొట్టారన్నారు. ఆ తర్వాత మొత్తానికే చేతులెత్తేయడంతో తెలంగాణలో ‘రిక్రూట్‌మెంట్ జీరో’గా మారిపోయిందని మాజీ మంత్రి విమర్శించారు.


జాబ్ క్యాలెండర్‌కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును తెలంగాణ సమాజం నిత్యం గమనిస్తోందని మాజీ మంత్రి చెప్పారు. తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు సీఎం ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పినా క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారని విమర్శించారు.


సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు రూ.2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని వ్యాఖ్యలు చేశారు. 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయమని హెచ్చరించారు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

మున్సిపల్ టికెట్ల అంశం.. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్

కేసీఆర్ మెడలు వంచింది నేనే.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 02:11 PM