Share News

కేసీఆర్‌కు నోటీసులు.. కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం: కేటీఆర్

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:16 PM

మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు..

కేసీఆర్‌కు నోటీసులు.. కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం: కేటీఆర్
KTR

హైదరాబాద్, జనవరి 29: మాజీ సీఎం కేసీఆర్‌పై (Former CM KCR) విచారణల పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని, నోటీసులతో చరిత్రను చెరిపేయలేరని కేటీఆర్ వెల్లడించారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

‘చావు నోట్లో తలబెట్టి.. కేసీఆర్ సచ్చుడో - తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం’ అని కేటీఆర్ అన్నారు.


‘ఇది విచారణ కాదు.. ఇది ప్రతీకారం. ఇది న్యాయం కాదు.. ఇది రాజకీయ దురుద్దేశం. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ఈ కక్షసాధింపు రాజకీయాలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారు’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 04:25 PM