Share News

రాహుల్‌ గాంధీ ఎక్కడ సచ్చినవ్‌..!!

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:55 AM

కేసీఆర్‌, కేటీఆర్‌ అనే ఇద్దరి ఉద్యోగాలు ఊడగొడితే.. 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి న రాహుల్‌గాంధీ.. ఏడ సచ్చినవ్‌..? ఎక్కడ పడుకున్నావు..? అంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు.

రాహుల్‌ గాంధీ ఎక్కడ సచ్చినవ్‌..!!

  • 2 లక్షల ఉద్యోగాలిస్తానని ఎక్కడున్నావ్‌

  • తెలంగాణకు హీరో కేసీఆర్‌, విలన్‌ కాంగ్రెస్‌

  • 900 అడుగుల లోతుకు ఆ పార్టీని పాతిపెడ్తాం

  • అలుగునూర్‌ దీక్షా దివస్‌ సభలో కేటీఆర్‌

కరీంనగర్‌/హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌, కేటీఆర్‌ అనే ఇద్దరి ఉద్యోగాలు ఊడగొడితే.. 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి న రాహుల్‌గాంధీ.. ఏడ సచ్చినవ్‌..? ఎక్కడ పడుకున్నావు..? అంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. వైకుంఠపాళిలో పెద్ద పాములా కాంగ్రెస్‌ అనే పాము తెలంగాణను మింగిందంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ కథకు కేసీఆర్‌ హీరో అని, కాంగ్రెస్‌ విలన్‌ అని, 500 రోజుల తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని అన్నారు. కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌లో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్‌ స్ఫూర్తి సభలో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమనే ఆయుధాన్ని, పౌరుషాన్ని పదునుపెట్టడానికే దీక్షా దివస్‌ సభను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.


2009 నంవబరు 29 తెలంగాణ చర్రితను మలుపు తిప్పిన రోజు అన్నారు. ఆనాటి కేసీఆర్‌ అరెస్ట్‌ దృశ్యాలు, జరిగిన ఘటనలు ఇంకా తన కళ్ల ముందే ఉన్నాయని చెప్పారు. స్వలాభం కోసం కాకుండా తెలంగాణ కోసం కొట్లాడి గెలిచిన మహాత్ముడు కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఎవరి భిక్షతో రాలేదని, కేసీఆర్‌ దీక్ష, అమరుల బలిదానాలతో సాధించినదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ పోరాటం లేకుంటే ‘తెలంగాణ ముఖ్యమంత్రి’ అనే పదవే లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలే ఉండేవి కావన్నారు. సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ మాట, ముచ్చట లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ జీవనాడి కాళేశ్వరంపై దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రాప్‌ హాలిడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన చంద్రబాబు కోసం అటు గోదావరి జలాలను కాళేశ్వరం నుంచి వృథాగా వదిలేశారని ఆరోపించారు.


అలాగే కృష్ణాజలాలను కుప్పం దాకా వెళ్లేలా చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ ఇంకొక దుర్మార్గమైన పార్టీ అని.. వాళ్లకు తెలంగాణపై అసలు ప్రేమలేదన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకటి సంచులు మోసే పార్టీ అయితే ఇంకొకటి చెప్పులు మోసే పార్టీ అని విమర్శించారు. అందరి మాటలను గమనిస్తున్నానని, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టనని అన్నారు. ముఖ్యంగా పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలంటూ హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం ముందున్న రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, ప్రభుత్వ పథకాల పేర్లలో ఇందిరమ్మ, రాజీవ్‌ పేర్లు లేకుండా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, 90 సీట్లు గెలుస్తామంటున్న ఆ పార్టీని 900 అడుగుల లోతుకు పాతిపెడ్తామని కేటీఆర్‌ అన్నారు.


డీలిమిటేషన్‌ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం

తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా కేంద్రం తెచ్చిన డీలిమిటేషన్‌ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత 24 శాతం ప్రాతినిధ్యాన్ని కొనసాగించే ప్రతిపాదన ముందుకు రావడం ప్రజల ఐక్య పోరాటానికి లభించిన ఫలితమన్నారు. ఇది కేవలం బీఆర్‌ఎస్‌ విజయం మాత్ర మే కాదని, జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది ప్రజల విజయమని పేర్కొన్నారు. ఇక, ఈ డీలిమిటేషన్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చెప్పాలన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్

Updated Date - Nov 30 , 2026 | 03:56 AM