ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. రేవంత్‌కు కేటీఆర్ వార్న్
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:56 PM
కాంగ్రెస్ మోసం చేసిన చోటే యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెనలయ్యాయని గుర్తు చేశారు. రేపటి తెలంగాణ నిర్మాతలు ఈ యువతే అని చెప్పుకొచ్చారు.
సరూర్‌నగర్, జులై 18: కాంగ్రెస్ మోసం చేసిన చోటే యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు(శనివారం) సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నెత్తురుడికిన యువత జంగ్ సైరన్ మోగిస్తోందన్నారు. యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెనలయ్యాయని గుర్తు చేశారు. రేపటి తెలంగాణ నిర్మాతలు ఈ యువతే అని చెప్పుకొచ్చారు. మోసం చేసిన వారికి బుద్ధి చెప్పడానికే సమావేశం పెట్టినట్లు తెలిపారు. సరూర్‌నగర్ స్టేడియం సాక్షిగా యువతను కాంగ్రెస్ దగా చేసిందని విమర్శించారు. ఢిల్లీ నుంచి గాంధీలు వస్తే, గల్లీ నుంచి కల్తీ కాంగ్రెస్ వాళ్లు వచ్చారని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
యూత్ డిక్లరేషన్ పేరిట యువతను నయవంచనకు గురిచేశారని కేటీఆర్ మండిపడ్డారు. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు కలిసి నకిలీ డిక్లరేషన్లు ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి నిరుద్యోగ యువత మోసపోతోందన్నారు. యువతను నమ్మించి నట్టేట ముంచింది కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలంటూ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో నోటిఫికేషన్లు లేవని.. లూటిఫికేషన్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అశోక్‌నగర్‌లో రాహుల్‌గాంధీ అబద్ధపు మాటలు చెప్పారని ఆరోపించారు. రాహుల్‌కు తెలుగు రాదని, తెలంగాణ ప్రజల బాధలు అర్థం కావన్నారు.
కొలువుల కుంభమేళా అని.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. కొలువులు అడిగితే యువతను పోలీసుల చేత కొట్టిస్తున్నారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ అంటూ అవినీతి సొమ్ముతో ప్రకటనలిచ్చారని.. ఇప్పుడు జాబుల్లేవని.. ప్రభుత్వం నుంచి ఉలుకులేదు, పలుకులేదంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్ జాబులు నింపకుండా, రాహుల్ జేబులు నింపుతున్నారని ఆరోపించారు. అన్నదమ్ముల అల్మరాలను రేవంత్ నింపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. హామీలపై ప్రజలు ప్రశ్నిస్తే అవహేళనగా మాట్లాడారని.. అవమానాలు, అవహేళనలను ప్రజలు, యువత ఎప్పటికీ మర్చిపోరన్నారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ పత్రాలిచ్చి.. రేవంత్‌రెడ్డి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాలపై సీఎం, మంత్రులు పూటకోమాట మాట్లాడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. భూములు, బూడిద, ఇసుక దోపిడీ జరుగుతోందని.. బ్రదర్స్, బామ్మర్ది లూటిఫికేషన్ రాష్ట్రంలో జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు. ‘కాంగ్రెస్‌కు ఘోరీ కడతామని యువత ఒట్టు పెట్టుకుంటున్నారు. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది రేవంత్ గుర్తుపెట్టుకో. మా హయాంలో కొన్ని పొరపాట్లు జరిగాయి.. అవన్నీ సరిచేసుకుంటాం. మా హయాంలో 2.32 లక్షల మందికి ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చాం.. 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని చెప్పుకొచ్చారు. 70 వేల ఉద్యోగాలిచ్చినట్టు నోటిఫికేషన్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి..
రంగు కలిపిన చికెన్, వాడిన నూనెలతో వంటలు.. హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ రైడ్
ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలి: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And Telugu News