Share News

KTR: రెండేళ్లలో చేసిన మోసం చాలు.. పాలనపై దృష్టి పెట్టు: సీఎంకు కేటీఆర్ హితవు

ABN , Publish Date - Jan 11 , 2026 | 05:00 PM

కేసీఆర్ చేసిన అప్పు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశారని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ చేసిన ఈ ఖర్చంతా మన కళ్ల ముందు కనబడుతుందని ఆయన పేర్కొన్నారు.

KTR: రెండేళ్లలో చేసిన మోసం చాలు.. పాలనపై దృష్టి పెట్టు: సీఎంకు కేటీఆర్ హితవు
KTR

హైదరాబాద్, జనవరి 11: బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే నాటికి రాష్ట్రంలో రూ.3.5లక్షల కోట్లు అప్పు ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఈ అప్పులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని ఆయన సోదాహరణగా వివరించారు. ఈ అప్పుల విషయంలో తమపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ కేడర్‌ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు.

రాష్ట్ర ప్రజల ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయంటే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్. ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ నిన్నమొన్నటి వరకు ప్రశ్నిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి నవ్వేవారని.. ఇక్కడ లంకెబిందెలు ఉంటాయని తాను వచ్చానని.. కానీ అవి ఇక్కడ లేవని రేవంత్ చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు.


కానీ కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఒకటి నేర్చుకున్నారని వ్యంగ్యంగా అన్నారు కేటీఆర్. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేసి పోయాడంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. అందుకే ఈ హామీలు నెరవేర్చలేకపోతున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే కేసీఆర్ అప్పులు చేసిన మాట వాస్తవమేనని ఈ సందర్భంగా కేటీఆర్ అంగీకరించారు. అంతేకాదు.. తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పుపై కాంగ్రెస్ నేతలు పలువురు పలు విధాలుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. దాంతో పార్లమెంట్‌లో బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు.


అది ఏమంటే.. 2014, జూన్ 2వ తేదీన తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని.. ఆ సమయంలో రాష్ట్రంలో రూ.72వేల కోట్ల అప్పు ఉందని తెలిపారు. ఆయన పదవి నుంచి దిగి పోయే సమయంలో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు రూ.3.5 లక్షల కోట్లని వివరించారు. అంటే.. కేసీఆర్ పదవి చేపట్టి దిగిపోయే నాటికి చేసిన అప్పు ఎంతంటే.. రూ.72వేల కోట్ల నుంచి రూ.3.5లక్షల కోట్లు తీసివేస్తే.. రూ.2.80లక్షల కోట్లని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.


కేసీఆర్ చేసిన ఈ అప్పు.. ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశారని వివరించారు. కేసీఆర్ చేసిన ఈ ఖర్చంతా మన కళ్ల ముందు కనబడుతుందన్నారు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏం చేశారంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్లు అంటూ రేవంత్ రెడ్డి అంటూ ఉంటారని.. కానీ హైదరాబాద్ పరిధిలో ఒక్క ఇందిరమ్మ ఇల్లూ ఆయన కట్టలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఇల్లు కట్టే వ్యక్తి కాదని కూలగొట్టే వ్యక్తి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.


గరీబ్ వాళ్ల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కూలగొడతారంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. అదే కాంగ్రెస్ పార్టీ నేత పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు సైతం వినాయక్ సాగర్‌లో అక్రమంగా నిర్మించారని.. దీనిని ఎందుకు కూలగొట్టడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిని వరస ప్రశ్నలు సంధించారు. ఆ ప్రాంతంలో పెద్దపెద్ద నేతల ఇళ్లు అక్రమంగా నిర్మించారని.. మరి వారి ఇళ్లు ఎందుకు కూల్చడం లేదంటూ కేటీఆర్ నిలదీశారు.


పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలపై ఈ సందర్భంగా కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్‌లో ప్రకాష్‌గౌడ్ ఉంటే.. పార్టీ కార్యక్రమానికి ఎందుకు రాలేదంటూ సందేహం వ్యక్తం చేశారు. పందిలాగా వందేళ్లు బతకొద్దు.. నంది లెక్క నాలుగేళ్లు బతికినా చాలు అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండేళ్లలో చేసిన మోసం చాలని.. పాలనపై దృష్టి పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ ఈ సందర్భంగా హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్

విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

For More TG News And Telugu News

Updated Date - Jan 11 , 2026 | 06:06 PM