Chandrababu Naidu: విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:05 PM
విశాఖపట్నం జగదాంబ సెంటర్‌లో మహిళపై ఒక వ్యక్తి దాడి చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.
అమరావతి, జనవరి 11: విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆదివారం ఉదయం స్థానిక జగదాంబ సెంటర్‌లో మహిళపై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆదివారం అమరావతిలో స్పందించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన విశాఖపట్నం నగర పోలీసులపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. స్పష్టమైన ఆధారాలు లేకున్నా ఈ దాడి కేసును ఛేదించారంటూ వారికి సీఎం చంద్రబాబు కితాబు ఇచ్చారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
విశాఖపట్నంలో ఇవాళ(ఆదివారం) ఓ యువతి ఆఫీస్‌కు నడిచి వెళ్తోంది. జగదాంబ సెంటర్‌లో థియేటర్ సమీపంలో ఉన్న రాజాసాబ్ సినిమా పోస్టర్‌ను ఫొటో తీసింది. ఆ సమీపంలో మాలధారణలో ఉన్న వ్యక్తి.. ఆమె వద్దకు వచ్చి గట్టిగా అరవడం ప్రారంభించాడు. తొలుత అతడు సమీపంలోని ఆటో డ్రైవర్లపై అరుస్తున్నాడని భావించింది. ఆ కొద్దిసేపటి తర్వాత.. ఆమె వద్దకు వచ్చి చెంపపై కొట్టి.. నోటికొచ్చినట్లు బూతులు తిట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఆమె కళ్ల అద్దాలు పగిలిపోయాయి. ఊహించని ఈ ఘటనతో యువతి భయాందోళనకు గురైంది.
అసలు తనను అతడు ఎందుకు కొట్టాడో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. జరిగిన ఘటనపై వీడియోలో వివరిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు.. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వారెవరూ కనీసం స్పందించలేదంటూ కన్నీటి పర్యంతమవుతూ వివరించింది. ఈ జరిగిన విషయాన్ని తన ఆఫీస్‌లోని సహచరులకు ఫోన్ ద్వారా వివరించింది.
దాంతో వారంతా జగదాంబ సెంటర్‌కు వచ్చి సదరు యువతిని తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జగదాంబ సెంటర్‌కు చేరుకుని.. సమీపంలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. యువతిపై దాడి చేసిన వ్యక్తిని కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే దాడి చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పైవిధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More AP News And Telugu News