తులం బంగారం ఇస్తామన్న వాళ్ల ఫొటోలు పోలీస్ స్టేషన్లలో పెట్టాలి!
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:38 AM
తులం బంగారం ఇస్తామన్న హామీలతో అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆ హామీలను మర్చిపోయిన వాళ్ల ఫొటోలు పోలీస్ స్టేషన్‌లో పెట్టాలేగానీ రైతులవి కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
భూములకు పట్టాలు ఇప్పించమని అడుగుతున్న రైతుల ఫొటోలు కాదు
రైతుల మీదకు 4 వేల మంది పోలీసోళ్లను పంపిస్తారా?
ఇదేమైనా దండయాత్రా?
బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు బాధిత రైతులతో కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తులం బంగారం ఇస్తామన్న హామీలతో అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆ హామీలను మర్చిపోయిన వాళ్ల ఫొటోలు పోలీస్ స్టేషన్‌లో పెట్టాలేగానీ రైతులవి కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ భూములకు పట్టాలు ఇప్పించమన్న రైతుల ఫోటోలను పోలీసులతో ఎందుకు తీయించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. లంగలు, దొంగలు, ప్రజలకు మాట ఇచ్చి తప్పిన మోసగాళ్ల ఫొటోలే పోలీస్ స్టేషన్లలో ఉండాలన్నారు. న్యాయం చేయమని కోరుతున్న రైతులను వేధించడం దుర్మార్గమన్నారు. బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోనున్న బహదూర్‌పల్లికి చెందిన రైతులతో సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ పట్టాలిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హామీలివ్వలేదా? ఆ మాట చెప్పిన వ్యక్తి మోసం చేస్తే పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫొటో పెట్టాలా? లేక రైతుల ఫొటోలు పెట్టాలా?’ అంటూ పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతుల ఇళ్ల మీదకు ఏదో పక్క దేశం మీద దండయాత్రకు పోయినట్టు 4 వేల మంది పోలీసోళ్లను పంపారని విమర్శించారు. రైతుల భూముల విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలను బహిరంగంగా చూపించాలని డిమాండ్ చేశారు. తాము బుల్లెట్ ట్రెయిన్‌కు వ్యతిరేకం కాదని, రియల్ ఎస్టేట్ దందాను మాత్రం ఒప్పుకోమని చెప్పారు.
ఏడాది తర్వాత కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, బహదూర్‌పల్లిలోనే మీటింగ్ పెట్టి రైతులకు పట్టాలు అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నేతలతో జిల్లాల వారీగా కేటీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీగ్రాఫ్ వేగంగా పడిపోతోందని, యువత దూరమైందనే ఆందోళన ఆ పార్టీ అగ్రనేతలను కలవరపరుస్తోందని, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తారస్థాయికి చేరిందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు సోమవారం కేటీఆర్‌ను కలిశారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్చుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సిరిసిల్ల పర్యటనలో ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘బార్ల మోత’.. శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఒకవైపు సర్కార్ బడులు మూతబడుతుంటే... మరోవైపు ఈ బార్ల మోత ఏమిటి? ఇది ప్రజా పాలనా? తుగ్లక్ పాలనా? అంటూ నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేతన్నల సంక్షేమమే అస్త్రంగా.. సిరిసిల్లపై సీఎం గురి!
బస్టాండ్‌లో 4రోజులుగా ఈగలు, దోమల మధ్యే!
Read Latest AP News And Telangana News And International News And Telugu New