రేవంత్‌రెడ్డి ఈఎంఐల ముఖ్యమంత్రి
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:13 AM
కాంగ్రెస్ అధిష్ఠానానికి రాజకీయ ఈఎంఐలు కట్టకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయంతోనే... రేవంత్‌రెడ్డి విదేశీ బొగ్గు కొనుగోళ్ల వ్యవహారంలో కమీషన్లు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
అధిష్ఠానానికి చెల్లించకపోతే పదవి పోతుంది
రేవంత్ హయాంలో అక్రమాలపై
న్యాయ విచారణ జరిపించాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధిష్ఠానానికి రాజకీయ ఈఎంఐలు కట్టకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయంతోనే... రేవంత్‌రెడ్డి విదేశీ బొగ్గు కొనుగోళ్ల వ్యవహారంలో కమీషన్లు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ హైకమాండ్‌కు సొమ్ములు పంపకపోతే తన పదవి రెన్యువల్ కాదని భయపడుతున్నారని, రేవంత్ ఓ ఈఎంఐల ముఖ్యమంత్రి అని విమర్శించారు. వాటిని వసూలు చేసేందుకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో రికవరీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్ల వ్యవహారంపైన, సింగరేణిలో ఆయన బావమరిది ప్రమేయంతో జరిగిందంటున్న రూ.10వేల కోట్ల కుంభకోణంపైనా దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం హయాంలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అక్రమాల పైనా న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాగా సింగరేణిలో తాము ఆరోపిస్తున్న సోలార్ పవర్ కుంభకోణాన్ని కూడా బయటపెడతామన్నారు. సింగరేణి భుజంపై తుపాకీ పెట్టి టెండర్లు, కమీషన్ల లెక్కలు వేసుకుంటున్నారని, బొగ్గు ఉత్పత్తిని తగ్గించడంవల్లే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలవద్ద బొగ్గు కొరత ఏర్పడిందన్నారు. సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టి, బొగ్గు సరఫరా చేయడం లేదంటూ సంస్థను బదనాం చేస్తున్నారని విమర్శించారు.
సాగునీరు, కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని, సుమారు 1000టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేసి, ఇప్పుడు ఎల్‌నినోను సాకుగా చూపుతూ చేతులెత్తేస్తున్నారన్నారు. ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని ఏపీ, కర్ణాటకల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు నీటి నిర్వహణలో చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఏపీలో సీఎం జల పండగ చేసుకుంటుంటే తెలంగాణలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో సీఎం రేవంత్ చెప్పాలన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులన్నీ కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన ఆయన... అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటు హక్కు దక్కేలా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ వాటాను తోడేస్తున్న కర్ణాటక రైతులు
Read Latest AP News And Telangana News And International