పండుగ పూట పల్లెలకు నగరవాసులు
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:07 AM
బతుకమ్మ, దసరా పండుగలకు రాజధాని హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం నుంచే నగరం ఖాళీ అవుతూ ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
ప్రయాణికులతో కిక్కిరిసిన ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్లు..
ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు వడ్డన..
ప్రయాణికుల ఆగ్రహంఅరకొర బస్సులు..
కిక్కిరిసిన ప్రయాణం..
ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ..
దసరా వేళ తప్పని తిప్పలు
విజయవాడ వైపూ పెరిగిన వాహనాల రద్దీ
జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్‌జాం
హైదరాబాద్ సిటీ/ చౌటుప్పల్/ కేతేపల్లి, ఆక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ, దసరా పండుగలకు రాజధాని హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం నుంచే నగరం ఖాళీ అవుతూ ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్లు జనం తాకిడితో పోటెత్తాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం ప్రయాణికులు పరుగులు తీయాల్సిన ఏర్పడింది. ఓవైపు అన్ని ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ, బస్సుల కోసం గంట, గంటన్నరకు పైగా ఎదురుచూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ రద్దీని ఆసరా చేసుకుని ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు భారం మోపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
సాధారణంగా రూ.300 వరకు ఉన్న టికెట్ల ధరలను రూ.450 వరకు పెంచడంపై మండిపడుతున్నారు. ఉచిత ప్రయాణం పేరుతో మహిళలకు వెసులుబాటు కలిపిస్తూనే, ఈ అదనపు బాదుడు ఏంటని ప్రశ్నిస్తున్నారు మరోవైపు, కూకట్పల్లి, సంజీవరెడ్డినగర్, అమీర్‌పేట ప్రాంతాల నుంచి ఏపీలోని పలు జిల్లాలకు నడిపే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహాకులు రద్దీని బట్టి ఏకంగా రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
జేబీఎస్ బస్టాండులో ప్రయాణికుల రద్దీ, ఏర్పాట్లను ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. బస్టాండ్ అంతటా తిరుగుతూ తాగునీరు, పారిశుధ్యం, విశ్రాంతి వసతుల వివరాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లకు www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను, సమాచారం కోసం 040-69440000, 040- 23450033 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
విజయవాడ హైవేపై ట్రాఫిక్‌జాం
సొంతవాహనాలు, ప్రైవేట్ బస్సుల్లో పెద్దఎత్తున జనాలు పయనం కావడంతో అటు హైదరాబాద్- విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వాహానాల రద్దీ అమాంతం పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైవోవర్ నిర్మాణం జరుగుతుండడంతో వాహనాలు సర్వీస్ రోడ్ల గుండా వెళుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతుండటంతో కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచి, నెమ్మదిగా ముందుకు కదిలాయి. ఇక, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కనిపించింది. ఫాస్టాగ్ స్కానర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ వాటాను తోడేస్తున్న కర్ణాటక రైతులు
ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి రూ.100కోట్లు ఇవ్వండి
Read Latest AP News And Telangana News And International