Share News

కేసీఆర్ రైతు బాంధువుడు.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహే: సీఎంపై కేటీఆర్ విమర్శలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:42 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. 30 నెలల పాలలో రూ.30 వేల కోట్ల రైతుభరోసా నిధులను ఎగ్గొటారని, పైగా సభల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ రైతు బాంధువుడు.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహే: సీఎంపై కేటీఆర్ విమర్శలు
Former Minister KTR

హైదరాబాద్, జూన్ 30: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి విరుచుకుపడ్డారు. 30 నెలల పాలలో రూ.30 వేల కోట్ల రైతుభరోసా నిధులను ఎగ్గొటారని, పైగా సభల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏకంగా నాలుగు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టారని ఆరోపించారు.


కేటీఆర్ పోస్ట్..

‘మీ 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా? గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా? కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే.. నీ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం మీ అవివేకమే. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీ చేసి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలి. అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయం. ఇప్పటికే రూ.50 వేల కోట్లతో చేయాల్సిన రెండులక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశావు. 72 సార్లు నీ ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్‌లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేది. రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకో. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న మీ చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారు. కేసీఆర్ టంచన్‌గా 11 సార్లు, రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ నిలిచి ఉంటే.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని గుర్తుపెట్టుకోండి’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం.. తల్లి మృతి, కొడుకుకి తీవ్ర గాయాలు

పోకిరీలను ధైర్యంగా ఎదుర్కోవాలి.. ఘట్‌కేసర్‌ ఘటనపై బాధితుడి సోదరి పోస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 12:59 PM