పోకిరీలను ధైర్యంగా ఎదుర్కోవాలి.. ఘట్‌కేసర్ ఘటనపై బాధితుడి సోదరి పోస్ట్
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:19 AM
ఘట్‌కేసర్ పోకిరీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కారులో వెళుతున్న కుటుంబాన్ని పోకిరీలు వెంటపడి వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆరుగురు ఆకతాయిలు రాత్రి సమయంలో కారును వెంబడించి దాడులకు పాల్పడ్డారు.
హైదరాబాద్, జూన్ 30: ఘట్‌కేసర్ పోకిరీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కారులో వెళుతున్న కుటుంబాన్ని పోకిరీలు వెంటపడి వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆరుగురు ఆకతాయిలు రాత్రి సమయంలో కారును వెంబడించి దాడులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు పొకిరీల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోకిరీల వేధింపులపై బాధితుడి సోదరి భార్గవి సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తన అన్న కుటుంబసభ్యులు కారులో హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఏవిధంగా ఇబ్బందులు పెట్టారు, వారి హంగామాతో కారులోని వారు ఎలాంటి ఆందోళనకు గురయ్యారనే విషయాన్ని భార్గవి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
పోకిరీలకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలి: భార్గవి
‘రాత్రి 8 గంటల సమయంలో మా అన్న.. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్నారు. బీబీనగర్ నుంచి ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కొందరు వ్యక్తులు వెంటపడ్డారు. అదే సమయంలో వారి హంగామాపై మా అన్న వెంటనే నాకు సమాచారం ఇచ్చారు. పోకిరీలు చేస్తున్న రచ్చతో కారులో ఉన్న పిల్లలు, మా వదిన వాళ్లు తీవ్రంగా భయపడ్డారు. కార్‌పై పదే పదే దాడి చేస్తూ ఆపాలంటూ హల్‌చల్ చేశారు. పోకిరీల దాడి నుంచి తప్పించుకుంటూనే మా అన్న డయల్ 100కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చేలోగానే మా అన్న ఔటర్ రింగ్ రోడ్డుపైకి వచ్చేశాడు. మూడు బైకులపై వెంటపడ్డ ఆకతాయిలకు సంబంధించిన వీడియోలను రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. పోకిరీలు చేస్తున్న ఆగడాలను మనకెందుకులే అని వదిలిపెడితే వాళ్లు రెచ్చిపోతున్నారు. ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే పోలీసులతోపాటు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి. పోకిరీలు ఏదో చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. వారి వీడియోలని పోస్ట్ చేసినందుకు నాకు భయం లేదు. వీడియో పోస్ట్ చేయడం వల్ల పోకిరీలు ఏదో చేస్తారని మా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ధైర్యంగా ఇలాంటి వాటిని ఎదుర్కోవాలి. ఆకతాయిలకు సరైన రీతిలో బుద్ధి చెప్తేనే మరొకసారి వాళ్లు ఇలాంటి పనులు చేయరు. పోకిరీలు చేసిన పనిని వెంటనే మా అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలోనే వారు రెచ్చిపోతున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో తగినరీతిలో భద్రతా ఏర్పాట్లు చేయాలి’ అంటూ సోషల్ మీడియాలో భార్గవి పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
సాయికృష్ణ లాకప్ డెత్.. ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్
బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం.. తల్లి మృతి, కొడుకుకి తీవ్ర గాయాలు
Read Latest Telangana News And Telugu News