రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం: కేటీఆర్
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:21 PM
బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ప్రజల ఆకాంక్ష అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ మాటలే నిజమవుతున్నాయన్నారు. ఓట్ల కోసం తామెప్పుడూ అబద్ధాలు చెప్పలేదన్నారు.
హైదరాబాద్, నవంబర్ 19: బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ప్రజల ఆకాంక్ష అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు (గురువారం) భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కేటీఆర్ సమక్షంలో పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ మాటలే నిజమవుతున్నాయన్నారు. ఓట్ల కోసం తామెప్పుడూ అబద్ధాలు చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌ను వాళ్ల ఎమ్మెల్యేలే తిడుతున్నారని.. అవినీతి ప్రభుత్వమని వాళ్లే చెప్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ఉండేవని.. కేసీఆర్ హయాంలో 32 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యాక్టింగ్‌లో కమలహాసన్‌ను మించిపోయారంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తానంటూ భట్టి విక్రమార్క అఫిడవిట్‌తో హనుమాన్ గుడిలో ప్రమాణం చేశారన్నారు. క్రెడిట్ కార్డు లాంటిది భద్రంగా పెట్టుకోవాలని.. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని గుర్తుచేశారు. మూడేళ్లు గడిచినా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యువల్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ పార్టీకి కాంగ్రెస్, బీజేపీ బానిసలంటూ దుయ్యబట్టారు.
మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చేశారని కేటీఆర్ ఆరోపించారు. పోలీసులకు ఇంజినీర్లు ఫిర్యాదు కూడా చేశారన్నారు. మూడేళ్ల నుంచి రెండు పిల్లర్లు రిపేర్ చేయలేకపోతున్నారని మండిపడ్డారు. వరద వచ్చి మొత్తం మేడిగడ్డ కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రూ.400 కోట్లతో పూర్తయ్యే మేడిగడ్డ రిపేర్ల కోసం.. రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మూడేళ్లలో 4.70 లక్షల పెన్షన్లు తొలగించారన్నారు. ఇప్పుడు కొత్తగా 4.65 లక్షల పెన్షన్లు ఇస్తున్నారని.. కొత్త పెన్షన్లపై కాంగ్రెస్‌వి డ్రామాలు అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్
Read latest Telangana News And Telugu NEws