మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి: కేటీఆర్
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:03 PM
చేవెళ్లలో కాలె యాదయ్యను తన మనిషి అనుకుని కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ గెలిపించిన కొన్ని రోజులకే.. ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లాడంటూ మండిపడ్డారు.
హైదరాబాద్, జనవరి 26: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో చేవెళ్ల నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రెండోసారి మోసపోతే.. మనం తప్పు చేసిన వాళ్లమవుతామని చెప్పారు. ఈసారి కేసీఆర్ సీఎం అయితే తెలంగాణలో మిగిలిన సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చేవెళ్లలో కాలె యాదయ్యను తన మనిషి అనుకుని కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ గెలిపించిన కొన్ని రోజులకే.. ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లాడంటూ మండిపడ్డారు. యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని.. ఆయనపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరామన్నారు. కానీ యాదయ్య.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పీకర్ అంటున్నారని పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, యాదయ్యలు చిన్ననాటి నుంచీ దోస్తులని.. వీరిద్దరూ ఒకే బండిపై తిరిగేవారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
మహాభారతంలో ధృతరాష్ట్రుడికి ఏమీ కనిపించనట్లు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సభాపతి అలానే వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చేవెళ్లలో ఐదేళ్ల అబ్బాయిని అడిగినా.. కాలె యాదయ్య పార్టీ మారాడనే చెబుతారన్నారు. కానీ స్పీకర్ మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు.. తాము పార్టీ మారామని చెప్పే దమ్ములేదని కేటీఆర్ అన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో చేవెళ్లలో దళితులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చాలా హామీలు ఇచ్చారని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రతీ దళిత కుటుంబానికి రూ.12 లక్షలు కాదు కదా.. కనీసం 12 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. వృద్ధులకు పింఛన్లు పెంచుతామని చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందరినీ కడుపులో పెట్టుకుని చూసేవారని వివరించారు.
నాట్లు వేసే సమయంలో టింగ్ టింగ్‌మంటూ రైతుల అకౌంట్‌లలో రైతుబంధు పడేదంటూ ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిలదీస్తుంటే.. తమపై కేసులు పెట్టి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. బూతులు తమకూ వచ్చన్న ఆయన.. మాట్లాడేందుకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. ప్రజల దయతో తామంతా మంత్రులమయ్యామని కేటీఆర్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణతంత్ర దినోత్సవం.. ఆ షాపులు బంద్..
2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది: గవర్నర్ అబ్దుల్ నజీర్
For More TG News And Telugu News