గణతంత్ర దినోత్సవం.. ఆ షాపులు బంద్..
ABN , Publish Date - Jan 26 , 2026 | 08:48 AM
తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులే కాదు.. మటన్, చికెన్ షాపులు మూసివేశారు.
హైదరాబాద్/అమరావతి, జనవరి 26: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. మరోవైపు ఈ వేడుకల కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూసివేశారు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలవుతోంది.
బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు ఈ రోజు నిలిచిపోయాయి. అలాగే మాంసం, చేపలు, కోళ్ల విక్రయాల దుకాణాలతోపాటు జంతు వధ శాలలను మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
ఇక ప్రతీ ఏడాది జనవరి 26, ఆగస్టు 5, గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఇవే తేదీల్లో మటన్, చికెన్ షాపులనూ మూసివేయాలని మున్సిపల్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తారు.
మరోవైపు సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా షాపులు బంద్ అంటూ రెండ్రోజుల ముందుగానే మద్యం దుకాణదారులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మద్యం ప్రియులు ముందుగానే తమ కావాల్సిన సరుకును భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. అదీకాక.. ఆది, సోమవారాలు వరుసగా సెలవులు రావడంతో శనివారమే మద్యం షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మరోవైపు ఈ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి రికార్డు స్థాయిలో మద్యం క్రయవిక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే.