2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది: గవర్నర్ అబ్దుల్ నజీర్
ABN , Publish Date - Jan 26 , 2026 | 10:50 AM
రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జీరో పావర్టీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలోనే అత్యధికులకు పెన్షన్ అందించడం ద్వారా పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు.
అమరావతి, జనవరి 26: స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. 10 సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. సోమవారం రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. జీరో పావర్టీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ అందించి పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు.
దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఎల్పీజీ సిలెండర్లను ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్ల కోసం ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం ద్వారా అందిస్తోందని చెప్పారు. రూ.978 కోట్ల నిధులను ప్రధానమంత్రి స్వనిధి కోసం ఖర్చు చేశామని పేర్కొన్నారు. పది సూత్రాలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో సామాజిక పెన్షన్లు అత్యంత కీలకమైనవని అభివర్ణించారు.
ప్రతి నెలా 63 లక్షల మందికిపైగా ప్రజలకు సామాజిక పెన్షన్లు అందిస్తున్నట్లు గుర్తు చేశారు గవర్నర్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందన్నారు. అలాగే పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. నీటి భద్రత ప్రభుత్వ విధామని చెప్పారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు.
పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. అందుకోసం పొలం పిలుస్తోంది, రైతన్న మీ కోసం, తదితర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వివరించారు.
నేటి గణతంత్ర వేడుక చరిత్రాత్మకమని అభివర్ణించారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా నిలిచిపోయిందని పేర్కొన్నారు. దాంతో రాజధాని నిర్మాణం సైతం ఆగిపోయిందని గుర్తు చేశారు. ఆర్థిక విశ్వాసం దెబ్బతిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే – ప్రగతికి నిజమైన శిల్పులని అభివర్ణించారు. ప్రభుత్వ ప్రతి చర్య, ప్రతి సంస్కరణ, ప్రతి సమీక్ష ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ వృద్ధిని పునరుద్ధరించడానికే ఉద్దేశించబడిందని స్పష్టం చేశారు. ఈ ప్రయాణం సులభం కాదు.. దీనికి క్రమశిక్షణ, సహనశక్తి, సామూహిక లక్ష్యంపై అపారమైన విశ్వాసం అవసరమయ్యాయన్నారు.
ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని.. సంస్థలు తిరిగి బలపడుతున్నాయని.. ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. పునరుద్ధరణ మార్పు ప్రయాణం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఈ దిశను మరింత స్పష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు.. ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణను ఒక స్పష్టమైన దృష్టిలో స్థిరపరిచిందని చెప్పారు. భారత స్వాతంత్ర్య శతాబ్ది నాటికి, బలమైన, సమగ్ర, ప్రపంచ స్థాయిలో పోటీతత్వం గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఈ సందర్భంగా సుపరిపాలనకు పది సూత్రాలు.. పేదరికం లేని సమాజం, యువగళం, జనాభా నిర్వహణ - మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఆగ్రి టెక్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, బ్రాండ్ ఏపీ, స్వచ్చంధ్ర, స్మార్ట్ గవర్నెన్స్ లక్ష్యాలను జస్టిస్ అబ్దుల్ వివరించారు. ఈ పది మార్గదర్శక సూత్రాల ఆధారంగా సాధించిన పురోగతిని, రాష్ట్ర దిశను, గమ్యాన్ని నిర్వచిస్తున్న విజయాలను ప్రజల ముందుంచడం గర్వకారణమని గవర్నర్ అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికత పాలన కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. సేవలను వేగవంతంగా, జీవనాన్ని సులభంగా, పరిపాలనను మరింత తెలివైనదిగా మార్చుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఒక్కటే.. సేవల అందించడం మెరుగుపరచడం, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తుందన్నారు.
అతి త్వరలోనే భారతదేశంలో తొలి క్వాంటం కంప్యూటర్‌ను అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో స్పేస్ సిటీ ఏర్పాటు ద్వారా అంతరిక్ష సాంకేతిక స్టార్టప్‌లు, తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరణల అగ్రగామి కేంద్రంగా నిలబెడుతున్నామన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కృత్రిమ మేధ (AI), బ్లాక్ చెయిన్ సాంకేతికతలను సమన్వయం చేస్తూ, పాలనలో పారదర్శకతను సామర్థ్యాన్ని మరింత పెంచుతోందని తెలిపారు. ఆరోగ్య రంగంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం ఏఐ ఆధారిత వైద్య నిర్ధారణ సేవలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.
వాట్సాప్‌లోనే 119 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. సర్టిఫికెట్లు పొందడం, సంక్షేమ పథకాల స్థితిని తెలుసుకోవడం, ఫిర్యాదులు నమోదు చేయటం తదితర అంశాలు ఇప్పుడు క్షణాల్లో సాధ్యమవుతున్నాయన్నారు. ఇప్పుడు పాలన ఒక మెసేజ్ దూరంలోనే ఉందని చమత్కరించారు. భారతదేశంలోనే డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమాలు.. ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా సాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణతంత్ర దినోత్సవం.. ఆ షాపులు బంద్..
పోలీసుల తీరును నిరసిస్తూ.. సెల్ టవర్ ఎక్కి నిరసన..
For More AP News And Telugu News