డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:48 AM
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)లో తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధి అని, రాష్ట్రానికి ఏ చిన్న అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు.
ఈ బిల్లుతో తెలంగాణకు నష్టం లేదు
దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం వాటా యథాతథం: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)లో తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధి అని, రాష్ట్రానికి ఏ చిన్న అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. 50శాతం సీట్ల పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని శనివారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
డీలిమిటేషన్ అంశంపై తమ పార్టీ వైఖరి మొదటి నుంచీ అత్యంత స్పష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం వాటాను యథాతథంగా కాపాడాలని తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా రక్షణ కల్పిస్తూ, పార్లమెంటు సీట్లను 50శాతం పెంచాలన్న ప్రస్తుత ప్రతిపాదన.. తమ ప్రధాన ఆందోళనకు పరిష్కారం చూపుతోందని అభిప్రాయపడ్డారు. అలాగే, మహిళా రిజర్వేషన్లకు గతంలోనూ బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని, దాని అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాగా, డీలిమిటేషన్‌పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీలిమిటేషన్‌తో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, ఎంపీ సీట్లు పెరగడం కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News