Share News

Uttam Kumar Reddy: ఒక్క నీటి చుక్కనూ వదలం: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:27 PM

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.

Uttam Kumar Reddy: ఒక్క నీటి చుక్కనూ వదలం: మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాల విషయంలో గొప్పగా చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటోందని విమర్శించారు. కృష్ణా నదీ జలాల్లో ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలుగా నీటి వాటాలపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు చేశారని గుర్తుచేశారు. అంతేకాదు తెలంగాణకు కేవలం 34 శాతం నీళ్లు సరిపోతాయని కేసీఆర్, హరీష్ రావులు అంగీకరించారని విమర్శించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో రూ.1.80 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 299 టీఎంసీలకు ఒప్పుకుని తెలంగాణకు మరణశాసనం రాసినట్లయ్యిందని మంత్రి మండిపడ్డారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 783 టీఎంసీలు కేటాయించాలంటూ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తోందని స్పష్టం చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 73 శాతానికి పైగా భూభాగం తెలంగాణలోనే ఉందని పేర్కొన్నారు.


పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.83 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోందన్నారు. ఇప్పటికీ మట్టి, కాంక్రీట్ పనులు మిగిలి ఉనన్నాయన్నారు. మూడేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులో కేవలం 35 శాతం పనులే జరిగాయని విమర్శించారు. కుర్చీ వేసుకుని కూర్చుంటా అని కేసీఆర్ అన్నారని, ఆ కుర్చీ ఎక్కడ పోయిందో, కేసీఆర్ ఎక్కడికి వెళ్లారో చెప్పాలని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని మంత్రి ఆరోపించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు రూ.41 వేల కోట్లు, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు రూ.1.20 లక్షల కోట్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని ఉత్తమ్ వెల్లడించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ కూడా అదనంగా పెంచారని.. అదే సమయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో టీఎంసీలను తగ్గించారని మండిపడ్డారు.


ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు త్వరలో వెలువడనుందని మంత్రి తెలిపారు. తాను స్వయంగా ట్రిబ్యునల్ వాదనలకు హాజరవుతున్నానని, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 72 శాతం వరకు నీటి కేటాయింపులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మొత్తం 814 టీఎంసీల కృష్ణా నీళ్లను తెలంగాణ, ఏపీకి న్యాయంగా కేటాయించాలన్నారు. తెలంగాణకు కృష్ణా నదిలో 72 శాతం వాటా కావాలని వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేటాయించిన 45 టీఎంసీల నీళ్లనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారాన్ని కూడా మించిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ హాజరై 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని.. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 511 టీఎంసీల నీటి కేటాయింపులపై ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం కృష్ణా నీటి వాటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాల్సిందే: మంత్రి శ్రీధర్

ఈ చర్చలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొని మాట్లాడుతూ.. నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఈ అంశంపై విస్తృతంగా చర్చించేందుకే సభలో లఘు చర్చను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇలాంటి కీలకమైన అంశంపై బీఆర్ఎస్ సభకు హాజరుకాకపోవడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. నదీ జలాల అంశంపై ప్రజలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఇదెక్కడి సభ.. ఇదెక్కడి సంప్రదాయం: సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్

గృహ జ్యోతి పథకంపై సభలో డిప్యూటీ సీఎం భట్టి క్లారిటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 04:20 PM