కేంద్ర మంత్రి ఖట్టర్‌తో కిషన్ రెడ్డి భేటీ.. హైదరాబాద్‌లో కీలక ప్రాజెక్టులపై చర్చ
ABN , Publish Date - May 20 , 2026 | 11:09 AM
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
న్యూఢిల్లీ, మే 20: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు(బుధవారం) సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర మంత్రితో భేటీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ కిషన్ రెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థ నుంచి టేకోవర్ చేసుకున్న నేపథ్యంలో మిగిలిన రెండోదశ పనులకు సంబంధించిన డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR), ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భాగ్యనగరంలోని మూసీనది పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంపైనా చర్చ జరిగిందని చెప్పారు. మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటి శుద్ధికి అమృత్ 2.0లో భాగంగా రూ.3,975 కోట్లతో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను(STP) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు
సూసైడ్ చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం..
Read Latest Telangana News And Telugu News