ఇరాన్ యుద్ధంతో ఆగ్రహం.. ట్రంప్‌నకు హ్యాండిచ్చిన సొంత పార్టీ సెనేటర్లు
ABN , Publish Date - May 20 , 2026 | 08:46 AM
ఇరాన్‌పై అమెరికా ప్రభుత్వ దాడులకు చెక్ చెప్పే వార్ పవర్స్ తీర్మానానికి సెనేట్ 50-47 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు కూడా మద్దతు తెలపడంతో కలకలం రేగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై దాడులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సొంతపార్టీలో రగులుతున్న అసంతృప్తి తొలిసారిగా సెనేట్‌లో పెల్లుబికింది. ట్రంప్ యుద్ధ చర్యలను కట్టడి చేసే వార్ పవర్స్ తీర్మానానికి అనుకూలంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు ఓటు వేశారు. దీంతో, 50-47 మెజారిటీతో ఈ తీర్మానానికి మంగళవారం సెనేట్ ఆమోదం లభించింది. తీర్మానాన్ని వ్యతిరేకించాలన్న ట్రంప్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ రిపబ్లికన్ సెనేటర్లు అనుకూల ఓటు వేశారు.
కెంటకీకి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ రాండ్ పాల్, మెయిన్ సెనేటర్ సుసన్ కోలిన్స్, అలాస్కా సెనేటర్ లీసా ముర్కోవస్కీ, లూసియానా సెనేటర్ బిల్ క్యాసిడీ ఈ తీర్మానికి మద్దతు తెలిపారు. మరో ముగ్గురు రిపబ్లికన్ సెనేటర్లు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. అంతేకాకుండా, డెమోక్రటిక్ పార్టీకి చెందిన జాన్ ఫెటర్మన్ (పెన్సిల్వేనియా) మాత్రం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు.
సభలో ఈ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరడంతో అధికార పార్టీలో అసంతృప్తికి అద్దం పడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఇలాంటి తీర్మానాలను వ్యతిరేకించిన సెనేటర్ క్యాసిడీ ఈసారి మద్దతు తెలపడం అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా ప్రభుత్వం చట్టసభలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా అంధకారంలో ఉంచిందని క్యాసిడీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
ట్రంప్ సొంత పార్టీలోనే చీలిక మొదలైందనేందుకు ఇది నిదర్శనమని కొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు కామెంట్ చేశారు. లోడ్ చేసిన గన్నుతో ఆటలాడే చిన్నపిల్లాడిలా ట్రంప్ తీరు ఉందని సెనేట్ ఓటింగ్‌కు మునుపు డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ చక్ షూమర్ వ్యాఖ్యానించారు. అయితే, సెనేట్ ఆమోదించిన ఈ తీర్మానానికి రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో తీవ్ర వ్యతిరేకత తప్పదని అక్కడి విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతిమంగా ట్రంప్ ఈ తీర్మానాన్ని వీటో చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐతో ఉద్యోగ సంక్షోభం: ఆంత్రోపిక్ సీఈవో
నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు