రేపే ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జనం.. అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:31 PM
రేపు (శుక్రవారం) జరగబోయే ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గణేశ్ శోభాయాత్ర నేపథ్యంలో రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జనానికి శరవేగంగా ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ రోజు అర్థరాత్రి 12 గంటల అనంతరం.. చతుర్దశి రోజున వేద పండితులు కలశపూజ నిర్వహించనున్నారు.
రేపు(శుక్రవారం) ఉదయం 5 గంటలకు స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. రేపటి నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఇప్పటికే స్వామి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. శోభాయాత్రకు అడ్డుగా ఉండే షెడ్లను తొలగిస్తున్నారు. ఈ మేరకు వెల్డిండ్ పనులు కొనసాగుతున్నాయి. బడా గణేశ్ శోభాయాత్ర కోసం టస్కర్ వాహనాన్ని ఉత్సవ సమితి సభ్యులు తీసుకువచ్చారు.
బడా గణేశుని శోభాయాత్ర
రేపు ఉదయం పూజ అనంతరం ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర మొదలవుతుంది. ఉదయం 6 గంటలకు గణేశ్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా.. లుంబినీ పార్క్ పక్కన ఉన్న ఎన్టీఆర్ మార్గ్ మీదుగా గణేశ్ విగ్రహాన్ని తరలిస్తారు. అనంతరం హుస్సేన్‌సాగర్‌లో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు.
కాగా.. మధ్యాహ్నం 12 గంటల్లోపే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. 69 అడుగుల ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం కోసం లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్‌ను ఏర్పాటు చేశారు.
నిమజ్జనం వేళ ట్రాఫిక్ ఆంక్షలు..
ఖైరతాబాద్ గణేశుని నిమజ్జన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలవుతాయి.
ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్/నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అయితే.. విగ్రహాలను తరలించే వాహనాలకు మాత్రమే ప్రధాన ఊరేగింపు మార్గంలో అనుమతి ఉంటుందని.. మిగతా వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
కాగా.. నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు పోలీసులకు సహకరించాలని వారు కోరారు.