నేను చావను నా కొడకా!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:40 AM
పొద్దున లేస్తే.. కేసీఆర్ చావాలె అంటరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా! పిల్లి శాపానికి ఉట్టి తెగిపడతదా? ఈ వెధవలు చావాలంటే కేసీఆర్ చస్తడా? నాకు 72 ఏళ్లు వచ్చాయి..
పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటరా!
ఈ వెధవలు చావాలని పదేపదే అంటే కేసీఆర్ చస్తాడా?
ఇక్కడి దరిద్రం పోయేదాకా పనిచేస్తూనే ఉంటా
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప.. అభివృద్ధి లేదు
ఓట్లేసే ముందు ఆలోచించండని అప్పుడే చెప్పాను
తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు
భూముల ధరలు అప్పుడెలా ఉండేవి? ఇప్పుడెలా ఉన్నాయి?
రైతుబంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీమ్
మూసీ వెంట గరీబోళ్లను ఏడిపిస్తున్నారు
బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం
జగిత్యాల సభలో కేసీఆర్.. బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డి
రాష్ట్రానికి పట్టిన శని పోవడానికే కేసీఆర్‌తో కలిశా: జీవన్‌రెడ్డి
కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోనూ జీవన్‌రెడ్డి ప్రభావం
జీవన్‌రెడ్డి గుండె ధైర్యం ఉన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సైన్యంలా వెంట తీసుకొని బీఆర్‌ఎస్‌లో చేరారు. జీవన్‌రెడ్డి, నేను 40 ఏళ్లుగా స్నేహితులం. చాలాకాలం ఇద్దరం కలిసి పనిచేశాం. తన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ ఆయన ఎందరికో ఆదర్శం. జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా.. ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోనూ జీవన్‌రెడ్డి ప్రభావం ఉంటుంది. జగిత్యాలను, కరీంనగర్‌ను ఇక్కడివారు చూసుకోవాలి. జీవన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. ఆయన్ను బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా.
- కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘పొద్దున లేస్తే.. కేసీఆర్ చావాలె అంటరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా! పిల్లి శాపానికి ఉట్టి తెగిపడతదా? ఈ వెధవలు చావాలంటే కేసీఆర్ చస్తడా? నాకు 72 ఏళ్లు వచ్చాయి.. జీవన్‌రెడ్డికి అంతకన్నా ఎక్కువ. మీ దీవెనలు మాకుంటే.. వయోభారం ఉన్నా సరే రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఇక్కడి దరిద్రం పోయేవరకు, ఇది మా తెలంగాణ.. మేం గర్వంగా బతుకుతామని అన్నివర్గాల ప్రజలు మంచిగా బతికేదాకా చివరి శ్వాస వరకు పనిచేస్తూ దూసుకుపోదాం. జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మా వంతు’’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ స్కామ్‌లే తప్ప.. ఎటువంటి అభివృద్ధి లేదని, అన్ని వర్గాలనూ మోసం చేశారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ పాలనలో మిషన్ భగీరథను ఐదేళ్లలో పూర్తిచేసి.. ప్రతి గ్రామానికీ, మారుమూల తండాలు, పల్లెలకు తాగునీరు అందించామని, ఇప్పుడెందుకు నీళ్లు రావడంలేదని ప్రశ్నించారు. ‘‘ఏడాదిలోపు 24 గంటలు కరెంటు ఇచ్చినం. ఈ దరిద్రులకు రాజ్యాన్ని అప్పగించే ముందు 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను తెచ్చాం. అలాంటిది.. ఇప్పుడేమైంది? ఓట్లేసేటప్పుడు ఆలోచించమని చిలకలకు చెప్పినట్లు చెప్పిన. కొందరు విన్నరు.. కొందరు వినలేదు. ఇప్పుడు తప్పు చేశామని బాధపడుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ 1.7 శాతం ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి పాలైందని కేసీఆర్ అన్నారు. ఏం పరిపాలన చేస్తరో చెయ్యనీ, వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని తాను మాట్లాడలేదని, బయటకు రాకుండా ఊరుకున్నానని తెలిపారు. ఈ పాలకులు ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప.. ఒక్కటైనా గొప్ప స్కీమ్ తెచ్చారా? అని ప్రశ్నించారు. అన్నింటా తెలంగాణను నంబర్‌వన్‌లో నిలిపామని, అలాంటి రాష్ట్రం ఇప్పుడేమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను అన్ని రంగాల్లో వెనకబాటుకు గురిచేశారని, సాగునీటి వనరుల్లేక రైతాంగం బతుకుదెరువు కోసం ఇతర చోట్లకు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, పాలమూరు జిల్లాలోని 90 శాతం యువత ముంబయికి పనుల కోసం వెళ్లేవారని గుర్తు చేశారు. గత పాలకుల వివక్ష కారణంగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే ఉద్దేశంతోనే తెలంగాణ పార్టీ పెట్టి.. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని వాడటమే నిషేధించిన పరిస్థితుల్లో.. రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా తొలి పదేళ్లలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుకోగలిగామని అన్నారు.

రైతు బంధుకు రాం రాం..!
‘‘రైతు బంధుకు రాం రాం. దళిత బంధుకు జై భీం. ఒక్కసారి ఇయ్యాల్సిన రైతు బంధును నెలకోసారి ఒక్క ఎకరాకు ఇస్తున్నరంట! యాప్‌లతో యూరియా ఇస్తామంటున్నరు. దీంతో రైతుల కాళ్లలో వాపులొస్తున్నయి. ఇది ప్రభుత్వమా? ఏం రోగమొచ్చింది? కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడిండ్రు? ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోయింది? కేసీఆర్ ఉన్నపుడు రియల్ ఎస్టేట్.. భూములకు ఎంత విలువ ఉండేది? హైవే పక్కనుంటే 2, 3 కోట్లు, డాంబర్ రోడ్డుకు పక్కకుంటే ఎకరాకు కోటి. ఇప్పుడు రైతుల భూముల ధరలు పడిపోయినయి. రాష్ట్రంలో ఎవరితో మాట్లాడినా ఇదే బాధ. రైతాంగం అన్నింటికీ గోస పడుతోంది. మక్కలు కొనడం లేదు. బయట కొంటామంటున్నారు.. లోపల అధికారులను మాత్రం కొనొద్దని చెబుతున్నారు. బోనస్ ఇస్తామని బోగస్ మాట. చేనేత కార్మికులను కూడా అవస్థ పెడుతున్నారు. ఉద్యోగులకు 72శాతం పీఆర్‌సీ ఇచ్చాం. ఇప్పుడు 7శాతమన్నా పీఆర్‌సీ ఇచ్చారా? రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్‌లు ఇవ్వడం లేదు. ఆటోడ్రైవర్లు బాధపడుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. ఆనాడు కొన్న ట్రాక్టర్లకు ఇప్పుడు డీజిల్ పోసే గతి లేదని విమర్శించారు. అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు ఆపేసి గ్రామపంచాయతీకి డబ్బులివ్వాలని తాను సీఎంగా ఆదేశాలు జారీ చేశాని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో పొద్దున లేస్తే దోపీడీ అని ఆరోపించారు. అందుకే జీవన్‌రెడ్డి కూడా ‘కాంగ్రెస్ పోవాలి.. బీఆర్‌ఎస్ రావాలి’ అంటున్నారని తెలిపారు. అన్ని వర్గాల జీవితాలు ఆగమైపోయాయని,. కచ్చితంగా మళ్లీ బీఆర్‌ఎస్ రావాలని అన్నారు.
అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం..
కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన హైడ్రాను తీసుకువచ్చిందని కేసీఆర్ మండిపడ్డారు. ఆ పేరుతో భూములను కబ్జా పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, రాగానే హైడ్రాను ఎత్తివేస్తామని, మొదటి సంతకం దానిపైనే చేస్తామని ప్రకటించారు. మూసీ వెంట ఉన్న గరీబోళ్లను కాంగ్రెస్ సర్కారు ఏడిపిస్తోందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు అయ్యేది కాదన్నారు. ఎటు చూసినా దోపిడీ, గూండాగిరి, అరాచకత్వంతో కాంగ్రెస్ వెళుతోందని దుయ్యబట్టారు. ప్రజాసంక్షేమం లేదని, ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టారని ధ్వజమెత్తారు. తమ హయంలో కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు ఒత్తిడి తీసుకువచ్చినా.. మీటర్లు పెట్టలేదని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ.30 వేల కోట్లు వదులుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆ రూ.30 వేల కోట్లకు ఆశపడి సంతకం పెట్టివచ్చిందని, త్వరలోనే కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టడం ఖాయమని అన్నారు. దానిపై ప్రజలు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. గొర్రెలు, చేపల పథకం బంద్ అయిందని, ఇంట్లో ఆడపిల్లలకు మహాలక్ష్మి కింద రూ.2500 ఇస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.

జీవన్‌రెడ్డి గుండె ధైర్యం ఉన్న వ్యక్తి..!
‘‘జీవన్‌రెడ్డి గుండె ధైర్యం ఉన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సైన్యంలా వెంట తీసుకొని బీఆర్‌ఎస్‌లో చేరారు. జీవన్‌రెడ్డి, నేను 40 ఏళ్లుగా స్నేహితులం. చాలాకాలం ఇద్దరం కలిసి పనిచేశాం. తన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ ఆయన ఎందరికో ఆదర్శం’’ అని కేసీఆర్ అన్నారు. జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా.. ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోనూ జీవన్‌రెడ్డి ప్రభావం ఉంటుందని తెలిపారు. జగిత్యాలను, కరీంనగర్‌ను ఇక్కడివారు చూసుకోవాలని, జీవన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని ఆకాంక్షించారు. జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నానని ప్రకటించారు. ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాలని, మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభం కావాలని అన్నారు. జగిత్యాల జైత్రయాత్రనే రాజకీయ పునరేకీకరణ శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టానికి పట్టిన శని విరగడయ్యేందుకే తాను కేసీఆర్‌తో కలిశానన్నారు. నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ కోసం పని చేశానని, చివరి 20 నెలలు ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేపట్టినా విఫలమైందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తో సాధ్యమని అన్నారు. ఈ సభకు బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు హాజరు కాలేదు. హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లగా, కేటీఆర్ వడదెబ్బ, స్వల్ప అస్వస్థత కారణంగా హాజరు కాలేలేదని తెలుస్తోంది.

హెలికాప్టర్ వైపు దూసుకొచ్చిన డ్రోన్
పైలట్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం
జగిత్యాల టౌన్/మర్కుక్: జగిత్యాలలో కేసీఆర్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా ఓ డ్రోన్ అడ్డు వచ్చింది. దానిని గుర్తించిన పైలట్.. చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అయితే హెలిప్యాడ్ ఉన్న ప్రాంతంలో డ్రోన్‌లపై నిషేధం ఉన్నప్పటికీ.. అక్కడ డ్రోన్ ఎగరడంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ కాన్వాయ్‌లో హెలిప్యాడ్ వద్దకు చేరుకుని, అక్కడ నుంచి సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో జగిత్యాలకు బయలుదేరారు. కేసీఆర్‌కు తన బాల్య స్నేహితుడు, ములుగు ప్రాంతానికి చెందిన జహంగీర్ దట్టి కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
