పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి దాడి చేయడం దుర్మార్గమైన చర్య: కేటీఆర్
ABN , Publish Date - Sep 14 , 2026 | 09:17 PM
రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పీఆర్వో, పీఏలపై పోలీస్ స్టేషన్‌లో జరిగిన దాడిపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్‌లో జరిగిన దాడిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘ఉదయం విచారణ కోసం రమ్మని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు రాత్రి సమయం దాకా ఎందుకు విచారణ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసి.. నా పీర్వో, పీఏలపై మూకుమ్మడి దాడికి పాల్పడాలని కుట్ర పన్నారు. లేకపోతే, నగరం నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 15 మంది రౌడీలు చొరబడి విచారణకు హాజరయిన వారిపై దాడి చేయడమేంటీ? ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. అసలు వాళ్లు రౌడీలేనా..? లేదా ఇది కాంగ్రెస్ గూండాల పనా..? లేకపోతే పోలీసులకే ముసుగులు వేసి ఈ కుట్ర పన్ని వారిపై దాడి చేయించారా..? ఈ దాడికి రాష్ట్ర హోం శాఖామంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. వెంటనే ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి’ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ పీఆర్వో, పీఏలపై ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతో కేసుపెట్టి.. విచారణ చేయాలని స్టేషన్‌కు పిలిపించుని.. ఖాకీల సమక్షంలో ఈ దాడి చేయించడం వెనక ముమ్మాటికీ ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోపల, వెలుపల ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను వెంటనే భద్రపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అరాచక పర్వానికి పాల్పడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ గుండాను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ కుర్చునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.
ముసుగు ధరించిన గుండాల దాడిలో గాయపడ్డ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డికి వెంటనే రక్షణ కల్పించి వారికి మెరుగైన చికిత్స అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాగా.. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన ప్రదర్శనలు చేసిన నేపథ్యంలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసన సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ పీఆర్వో, పీఏలను విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్
నల్లగొండలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి