బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:09 PM
పండగ రోజు రాజకీయాలు మాట్లాడాలని లేదని.. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంతో తప్పడం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాజకీయ పాలసీలను శుద్ధి చేయాలని.. బీఆర్ఎస్ ఆలోచనలను శుద్ధి చేయాలని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: గాంధీభవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మహేశ్ మాట్లాడుతూ.. పండగ రోజు రాజకీయాలు మాట్లాడాలని లేదని.. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంతో తప్పడం లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాజకీయ పాలసీలను శుద్ధి చేయాలని.. బీఆర్ఎస్ ఆలోచనలను శుద్ధి చేయాలని వ్యాఖ్యానించారు. ఉత్తుత్తి అసెంబ్లీకి దళితుడిని స్పీకర్ చేశారని.. బీసీ బిడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం చేశారన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి...
బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. చేతుల్లో ఉన్న పని చేస్తే కేసీఆర్‌ను నమ్ముతామన్నారు. కేసీఆర్ ఎల్లుండి(సెప్టెంబర్ 16) అసెంబ్లీ సమావేశాలకు రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వస్తే బీఆర్ఎస్ నేతలపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేయాలని స్పీకర్‌ను కోరుతామని అన్నారు. స్పీకర్‌ను కులం పేరుతో దూషించారని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతామధు వ్యాఖ్యలు బీఆర్ఎస్ వైఖరికి నిదర్శనమన్నారు. తాతా మధు చేసినవి అనుకోకుండా జారిన మాటలు కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నరనరానా దళిత వ్యతిరేకత ఉంటుందని వ్యాఖ్యానించారు.
దళితులపై ఎందుకంత అక్కసు..
ఉద్యమంలో కేసీఆర్ దళిత కార్డు వాడారని.. దళిత కవులు, కళాకారులను ఆయన ఎలా అవమానపరిచారో చూశామని మహేశ్ అన్నారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగాయని మండిపడ్డారు. ఉప ఎన్నికల కోసమే కేసీఆర్ దళితబంధు తెచ్చారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టినంత మాత్రానా వారసులు కాలేరని తెలిపారు. ‘దళితులు నడిచిన రోడ్డును శుద్ధి చేయడమేంటి? దళితులపై బీఆర్ఎస్ నేతలకు ఇంత అక్కసు ఉందా?’ అంటూ మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీనాక్షి అంశంపై..
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంశంపై మహేశ్ మాట్లాడారు. మీనాక్షి విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారని చెప్పారు. ఆమె విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. కొత్త ఇన్‌ఛార్జ్ విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కొండా సురేఖను అధిష్ఠానం పిలిచిందన్న అంశంపై తనకు సమాచారం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు.. వాహనదారులకు అలర్ట్
నల్లగొండలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
Read Latest Telangana News And Telugu News