Share News

ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్..

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:35 PM

సింగరేణి సంస్థ గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేకపోవటం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికుల మీద ప్రేమతో సంస్థను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీలు ఏవైనా సరే అందులో ఉండే ట్రేడ్ యూనియన్లు మాత్రం కార్మికుల కోసమే మాట్లాడాలని కవిత హితవుపలికారు.

ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్..
Telangana Jagruti President Kavitha

హైదరాబాద్: సింగరేణి సంస్థ గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేకపోవటం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికుల మీద ప్రేమతో సంస్థను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీలు ఏవైనా సరే అందులో ఉండే ట్రేడ్ యూనియన్లు మాత్రం కార్మికుల కోసమే మాట్లాడాలని కవిత హితవుపలికారు. జెండాలన్నీ పక్కన పెట్టి కార్మికుడికి మంచి చేయటమే అజెండా కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం ముగింపు సందర్భంగా కవిత మాట్లాడారు.


ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..'సింగరేణిపై రేవంత్ సర్కార్‌కు అవగాహన లేదు. నైనీ బ్లాక్‌కు సంబంధించి మన కార్మికులు చేసిన ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ బాధ, ఆక్రోశంతోనే సింగరేణిలో 13 వేల మంది కార్మికులు ఎక్కువగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రధాని మోదీ లేబర్ కోడ్ పేరుతో నాలుగు నల్ల చట్టాలు తెస్తే.. ఆ చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. అలాంటి నిర్ణయం తీసుకున్న ఆమెకు మనం సెల్యూట్ చేయాల్సిందే. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేబర్ కోడ్ చట్టాలను అమలు చేయటం లేదు.


కానీ మన రాష్ట్రం మాత్రం ఈ చట్టాలను అమలు చేయమని చెప్పే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు. ఇవాళ్టి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా ఐదు తీర్మానాలు చేసుకున్నాం. ఈ సమావేశంలో చర్చించి చేసిన తీర్మానాలను లేఖ రూపంలో ప్రభుత్వానికి సమర్పిస్తాం. తెలంగాణకు సింగరేణి ప్రాణపదం. కచ్చితంగా సంస్థను కాపాడుకుంటాం. 70 ఏళ్ల వయసులో మా హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌పై రౌడీ షీట్ పెట్టారు. ఆయన పెద్ద రౌడీ అని ప్రభుత్వం అనుకుంటే మేము చిన్న రౌడీలం. మాతోపాటు ధర్మసమాజ్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా జత చేరాయి. మా రౌడీల గుంపును తట్టుకోవటం ప్రభుత్వం వల్ల కాదు.


ఈ కార్యక్రమాన్ని ఏదో రాజకీయ కార్యక్రమం లాగా కాదు.. సింగరేణి సంస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పెట్టాం. మరో 20 రోజుల్లో కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం. మేము తీర్మానం చేసిన అంశాలకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలి. లేదంటే రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత బొగ్గు బాయి బాట పడుతాం. అదే విధంగా సమ్మెకు కూడా వెనుకాడబోం. మాతో, సింగరేణితో పెట్టుకోవద్దు. రాజకీయ పార్టీగా వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేసే కొత్త తరహా రాజకీయాలు ఎలా ఉంటాయో చూపించబోతున్నాం' అని కవిత చెప్పుకొచ్చారు.


ఐదు తీర్మానాలు..

  • కేంద్రం తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. అసెంబ్లీలో తీర్మానం చేయాలి.

  • మెడికల్ బోర్డును మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే ఏర్పాటు చేయాలి. పెండింగ్ కేసులు పరిష్కరించాలి.

  • అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలి. వీటికి లీగాలిటీ వర్తించదు. పొలిటికల్ విల్ ఉంటే సమస్య పరిష్కరించవచ్చు.

  • సింగరేణి సంస్థ ఆల్ట్ మిన్ కంపెనీతో రూ.2,250 కోట్లతో చేసుకున్న ఒప్పందంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

  • నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను కొత్తగా వచ్చే గనులనూ సింగరేణి సంస్థనే ఆపరేట్ చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి

కొమురం భీం జిల్లాలో వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారుగా..

Updated Date - Apr 05 , 2026 | 04:36 PM