యూఎస్ సైన్యం కదలికలపై చైనా కంపెనీల నిఘా
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:16 PM
ఇరాన్‌లో యుద్ధం నేపథ్యంలో చైనా కంపెనీలు ఏఐ సాయంతో అమెరికా సైన్యం కదలికలపై నిఘా పెడుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా ప్రభుత్వమే ఈ కంపెనీలను ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా టెక్ కంపెనీలు అమెరికా సైన్యం కదలికలపై ఓ కన్నేశాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా ప్రభుత్వం ఇరాన్‌కు నేరుగా మద్దతు ప్రకటించనప్పటికీ ఈ ప్రైవేటు కంపెనీల సాయంతో పరోక్షంగా సహకరిస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని చైనా కంపెనీలు ఏఐ సాయంతో విశ్లేషిస్తూ అమెరికా సైన్యం కదలికలను గమనిస్తున్నాయి. ఈ దిశగా రూపొందించిన ఏఐ నిఘా టూల్స్‌ను బహిరంగంగానే ప్రచారం చేసుకుంటున్నాయి.
శాటిలైట్ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, షిప్పింగ్ సమాచారం వంటి వాటిని ఏఐతో విశ్లేషిస్తూ చైనా కంపెనీలు అమెరికా సైన్యం కదలికలపై పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా సైనిక విమానాల సమాచారాన్ని బహిరంగపరిచే అనేక పోస్టులు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం తరువాత ఇలాంటి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ కంపెనీలకు చైనా మిలిటరీ వ్యవస్థతో కూడా సంబంధాలు ఉన్నాయి. చైనా రక్షణ రంగానికి ప్రైవేటు రంగ కంపెనీల శక్తిసామర్థ్యాలను జోడించే దిశగా అక్కడి ప్రభుత్వం ఈ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ తీరుతో అమెరికాకు ముప్పు ఎంత అనేదానిపై కూడా రక్షణ రంగ నిపుణులు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ టూల్స్ సామర్థ్యాలు పెరిగే కొద్దీ అమెరికాకు తన సైన్యం కదలికలను గోప్యంగా ఉంచడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు. ప్రైవేటు రంగ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యాలు పెరిగే కొద్దీ చైనాకు సంక్షోభ సమయాల్లో అమెరికాకు సవాలు విసిరే సత్తా పెరుగుతుందని అంటున్నారు. చైనా కంపెనీలు ఏఐని యుద్ధం రంగంపై నిఘా పెట్టే సాధనంగా మార్చేస్తున్నాయని అమెరికన్ చట్టసభల సభ్యులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధాన్ని వాడుకుని చైనా కంపెనీలు లాభపడుతున్నప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం శాంతిస్థాపనకు పదే పదే పిలుపునిస్తోంది. ఈ వ్యూహంతో యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకోకుండానే చైనా వ్యూహాత్మ లాభాలను పొందుతోందని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్‌ను దాటిన మరో నౌక.. భారత్ వైపు సేఫ్‌గా జర్నీ
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగురి మృతి..