సొంత మనుషులపై మరిగే నీళ్లు పోయడం కేటీఆర్ నైజం
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:28 AM
సొంత మనుషులపై మరిగే నీళ్లు పోసే నైజం కేటీఆర్‌దని... ఉద్యమకాలంలో బీఆర్‌ఎ్‌సకు పూర్తి అండగా ఉన్న ప్రతిమ శ్రీనివాసరావుపై విచారణ కోరడమంటే.. నమ్మినోళ్లను నట్టేట ముంచడమేనని తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఇంటి మనిషిని నన్నే కిరాయి మనుషులతో తిట్టిస్తున్నారు
ప్రతిమ శ్రీనివాసరావుపై విచారణ కోరడమంటే నమ్మినోళ్లను ముంచడమే
కేటీఆర్‌కు సింగరేణి కార్మికుల కష్టాలు తెలియవు
మా టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో పాల్గొంటుంది
సీఈసీ రాజీనామా కోసం కాంగ్రెస్ చేసే ఫేక్ ర్యాలీలో పాల్గొనం
ఎల్‌నినోను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం టీఆర్ఎస్ అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): సొంత మనుషులపై మరిగే నీళ్లు పోసే నైజం కేటీఆర్‌దని... ఉద్యమకాలంలో బీఆర్‌ఎ్‌సకు పూర్తి అండగా ఉన్న ప్రతిమ శ్రీనివాసరావుపై విచారణ కోరడమంటే.. నమ్మినోళ్లను నట్టేట ముంచడమేనని తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాలపై విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా కేటీఆర్ లేఖ రాయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సాయంచేసిన వాళ్లను, కుల బంధువులను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. ఇంటి మనిషినైన తనను కూడా కిరాయి మనుషులతో తిట్టించే తీరు కేటీఆర్‌దని ఆమె మండిపడ్డారు.
ఇది ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ప్రతిమ శ్రీనివా్‌సను సీఎం కాపాడుతున్నారని, నిన్నటి ప్రెస్మీట్లో ఆయన పేరు ప్రస్తావించకుండా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇక బీఆర్ఎస్ చేపట్టింది సింగరేణి కార్మిక గర్జనసభ కాదని.. కేటీఆర్ గర్జన, ఆ పార్టీ బలప్రదర్శన కోసం చేసిన ప్రయత్నమని విమర్శించారు. సింగరేణి కార్మికుల కష్టాలేవీ కేటీఆర్‌కు తెలియవన్నారు. కార్మికుల కోసం పనిచేస్తున్న హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ కూటమే సింగరేణి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. తమ టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో నిలబెడతామని తెలిపారు. దసరా రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఒక అభ్యర్థి పేరును ప్రకటిస్తామన్నారు. సీఈసీ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ చేస్తున్న నకిలీ ర్యాలీకి మద్దతు ఇవ్వబోమని చెప్పారు.
కాలయాపన చేసి.. ఇప్పుడు చేతులెత్తేస్తారా?
ఎల్‌నినోతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని, కానీ ముందస్తు చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కవిత విమర్శించారు. కరువు పరిస్థితులు వస్తాయని శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా కాలయాపన చేసి ఇప్పుడు చేతులెత్తేస్తారా? అని మండిపడ్డారు. రైతులు త్యాగాలు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు. పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని లీకులు ఇస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయడం లేదేమని ప్రశ్నించారు.
ఆగస్టులో 28శాతం లోటు వర్షపాతం నమోదైనప్పుడే పొరుగు రాష్ట్రాలు కరువు మండలాలను ప్రకటించి, కేంద్రానికి నివేదిక పంపాయని కవిత గుర్తు చేశారు. సీఎం రేవంత్ మాత్రం నింపాదిగా సమీక్షలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కరువు పరిస్థితుల అంశంలో అఖిలపక్ష భేటీ పెడతామని ఇప్పుడు అంటున్నారని, దానితో ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు ఇదే సరైన సమయమని.. వచ్చే వానాకాలంలోగా పనులు పూర్తిచేసి, గోదావరి నీళ్లను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఇంత సంక్షోభంలో ఉంటే సీఎం తన కుటుంబానికి సంపదను దోచేపెట్టే పనిలో ఉన్నారని, యాదాద్రి విద్యుత్ ప్లాంటులో కొన్ని భాగాలను ప్రైవేటీకరించి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రశాంత్‌భూషణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
త్వరలో యూఎల్సీ మార్గదర్శకాలు?
రేవంత్‌రెడ్డి ఈఎంఐల ముఖ్యమంత్రి
Read Latest AP News And Telangana News And International