Share News

త్వరలో యూఎల్‌సీ మార్గదర్శకాలు?

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:23 AM

పట్టణ భూ గరిష్ఠ పరిమితి కేటగిరిలో (యూఎల్‌సీ) పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, త్వరలోనే కొత్త దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలు జారీ చేసేందుకు సన్నద్ధమైంది.

త్వరలో యూఎల్‌సీ మార్గదర్శకాలు?
Telangana Government

  • కొత్త దరఖాస్తుల స్వీకరణపై స్పష్టత

  • రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ పరిధిలో 3 వేల ఎకరాల యూఎల్‌సీ భూములు

  • పాత దరఖాస్తులకు పాత జీవోల ప్రకారమే పరిష్కారం

హైదరాబాద్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పట్టణ భూ గరిష్ఠ పరిమితి కేటగిరిలో (యూఎల్‌సీ) పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, త్వరలోనే కొత్త దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలు జారీ చేసేందుకు సన్నద్ధమైంది. ఆరుగురు మంత్రులు, ఉన్నతాధికారులు పలు దఫాలుగా యూఎల్‌సీ నూతన విధానంపై చర్చించినట్లు తెలిసింది. ఇందుసంబంధించి జిల్లాల వారీగా యూఎల్‌సీ భూముల వివరాలు కూడా ప్రభుత్వం కలెక్టర్ల నుంచి తెప్పించింది. ఆ వివరాలను దృష్టిలో పెట్టుకుని.. కొత్త దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపులపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దసరా తర్వాత ఏ క్షణంలోనైనా కొత్త దరఖాస్తుల స్వీకరణపై స్పష్టతనిస్తూ యూఎల్‌సీ మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.


రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో సుమారు 3 వేల ఎకరాల వరకు యూఎల్‌సీ భూములున్నట్లు సమాచారం. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం మిగులు భూముల క్రమబద్ధీకరణకు నూతన విధానం తీసుకురానున్నట్లు సెప్టెంబరు 16న అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న జీవోల ప్రకారం కొత్త మార్గదర్శకాలు ఇవ్వాలా లేక కొన్ని జీవోలను సవరించి.. ఫీజు నిర్ణయంతోపాటు విస్తీర్ణంపై పరిమితి విధించి కొత్త ఉత్తర్వులు ఇవ్వాలా అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. 22ఏ సమస్యల పరిష్కారంలో భాగంగా పాత ఉత్తర్వుల కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం సెప్టెంబరు 27న ఇచ్చిన మెమో ప్రకారం పాత దరఖాస్తులకు అధికారులు పరిష్కారం చూపుతున్నారు.


గతంలో జారీ చేసిన ఉత్తర్వులు 455, 456, 747, 92 ప్రకారం పెండింగ్‌లో ఉన్న, పాక్షికంగా క్రమబద్ధీకరణ చేసిన, క్రమబద్ధీకరణకు నోచుకోని కాలనీల దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. పాత దరఖాస్తులు సుమారు 1,78000 వరకు ఉండగా అందులో ఇప్పటి వరకు పరిష్కారం కాని దరఖాస్తులు సుమారు 18 వేల వరకు ఉన్నాయి. వీటన్నింటిని రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి.. అర్హమైన వాటికి ఆమోదం తెలుపుతున్నారు. 22ఏ వివాదాలను నెల రోజుల్లో పరిష్కరించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు మెమోలు జారీ చేసిన రెవెన్యూ అధికారులు త్వరలోనే యూఎల్‌సీ విధివిధానాలు ఖరారు చేసి కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రశాంత్‌భూషణ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి

పండుగ పూట పల్లెలకు నగరవాసులు

రేవంత్‌రెడ్డి ఈఎంఐల ముఖ్యమంత్రి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 06:23 AM