Share News

చదరపు అడుగుకు అద్దె 250

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:31 AM

హైదరాబాద్‌లో ఖరీదైన వస్తువుల షాపింగ్‌ అంటే జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, హిమాయత్‌నగర్‌ ప్రాంతాలు టక్కున గుర్తుకొస్తాయి.

చదరపు అడుగుకు అద్దె 250
Jubilee Hills Shop Rent

  • జూబ్లీహిల్స్‌లో దుకాణాలకు రికార్డు స్థాయి అద్దెలు

  • ప్రపంచంలోనే ఖరీదైన వాణిజ్య ప్రాంతాల్లో 51వ స్థానం

  • 52వ స్థానంలో బంజారాహిల్స్‌, హిమాయత్‌నగర్‌

  • ఆసియా-పసిఫిక్‌ ఖరీదైన రిటైల్‌ ప్రాంతాల జాబితాలో చోటు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఖరీదైన వస్తువుల షాపింగ్‌ అంటే జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, హిమాయత్‌నగర్‌ ప్రాంతాలు టక్కున గుర్తుకొస్తాయి. జూబ్లీహిల్స్‌, అందునా రోడ్‌ నెంబర్‌ 36 అంటే మాత్రం వ్యాపార వర్గాలకు ప్రత్యేకమైన ఆసక్తి. దీనిని హై స్ట్రీట్‌గా చెబుతుంటారు. జూబ్లీహిల్స్‌, చెక్‌పోస్ట్‌ నుంచి 100 ఫీట్ల రోడ్‌ వరకు వుండే ఈ రహదారిలో షాపు అద్దెకు దొరకటమే కష్టం. దొరికినా అద్దె భరించడం అంత సులువు కాదు. అందుకే ఈ ప్రాంతానికి తాజాగా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆసియా- ఫసిఫిక్‌ ప్రాంతంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్‌ ప్రాంతాల అద్దెలను విశ్లేషిస్తూ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ విడుదల చేసిన ’మెయిన్‌ స్ట్రీట్స్‌ అక్రాస్‌ ది వరల్డ్‌ -2026’ నివేదికలో హైదరాబాద్‌లోని 3 ప్రాంతాలు చోటు సంపాదించాయి.


వాటిలో జూబ్లీహిల్స్‌ 51వ స్థానంలో నిలవగా.. బంజారాహిల్స్‌, హిమాయత్‌నగర్‌ సంయుక్తంగా 52వస్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ నివేదిక ప్రకారం జూబ్లీహిల్స్‌లోని ప్రధాన రిటైల్‌ ప్రాంతాల్లో చదరపు అడుగుకు సగటున నెలకు రూ.250 అద్దె పలుకుతోంది. బంజారాహిల్స్‌లో రూ.230, హిమాయత్‌నగర్‌లో రూ.225 అద్దె ఉంది. అంటే ఈ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో దుకాణం ఏర్పాటు చేయాలంటే నెలకు రూ.2.25 లక్షల నుంచి రూ.2.50లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దేశంలోని పలుమెట్రో నగరాలతో పోలిస్తే ఈ అద్దెలు తక్కువే. దేశంలో త్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతంగా ఢిల్లీలోని ఖాన్‌ మార్కెట్‌ నిలిచింది. అక్కడ చదరపు అడుగుకు నెలకు సుమారు రూ.1,875 అద్దె పలుకుతోంది. జాబితాలో ఈ ప్రాంతం 25వ స్థానంలో నిలిచింది. ముంబైలోని లింకింగ్‌ రోడ్‌ చదరపు అడుగుకు రూ.1,175తో 33వ స్థానంలో ఉంది.


మూడు ప్రాంతాలు... మూడు ప్రత్యేకతలు

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, హిమాయత్‌నగర్‌ ప్రాంతాలకు వాణిజ్య పరంగా ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ఒకే తరహా షాపింగ్‌ కేంద్రాలు కావు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ప్రీమియం బొటిక్‌లు, డిజైనర్‌ స్టోర్లు, ఖరీదైన బ్రాండ్ల షోరూమ్‌లు, కేఫ్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. మరోవైపు హిమాయత్‌నగర్‌ సంప్రదాయ హైస్ట్రీట్‌ షాపింగ్‌ ప్రాంతంగా తన హవాను కొనసాగిస్తోంది. ఆభరణాలు, వస్త్రాలు, ఆహార ఔట్‌లెట్లు, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తుల దుకాణాలతో నిత్యం సందడిగా ఉంటుంది. ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణాలకు బ్రాండ్లు ప్రాధాన్యం ఇవ్వటానికి ఈ ప్రాంతాల్లో జరుగుతున్న భారీ వ్యాపార కార్యకలాపాలే కారణమని ఈవెంట్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక ప్రకారం 2026 మూడో తైమ్రాసికంలో హైదరాబాద్‌లో 4.5 లక్షల చదరపు అడుగుల రిటైల్‌ లీజింగ్‌ నమోదైంది. ఇందులో 86 శాతం ప్రధాన రహదారుల వెంట ఉన్న హైస్ట్రీట్‌ ప్రాంతాల్లోనే ఉంది. ఈ ప్రాంతాల్లో స్టోర్లను ఏర్పాటు చేస్తున్నవాటిలో ఫ్యాషన్‌ విభాగం ముందుంది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 01:31 AM