Share News

సొమ్మొకరిది.. సోకొకరిది

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:33 AM

ప్రపంచంలో మానవాళి ఎదుర్కొంటున్న పలు సంక్షోభాలకు కారణం అభివృద్ధి చెందిన దేశాలే అయినా, ఆ సంక్షోభాల వల్ల సమస్యల పాలవుతున్నది మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలని ‘యూకే ముస్లిం ట్రేడ్‌ ఫోరం’ చైర్మన్‌ ఇక్బాల్‌ సక్రాని పేర్కొన్నారు.

సొమ్మొకరిది.. సోకొకరిది
Iqbal Sacrani

  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే సహజవనరులు పుష్కలం

  • వాటిని సరుకులుగా, ఉత్పత్తులుగా మార్చి మళ్లీ వాటికే విక్రయిస్తున్న సంపన్న దేశాలు

  • ప్రపంచ సంక్షోభాలకు కారణం ఈ దేశాలే ..

  • అన్యాయమైన ఈ ఆర్థిక వ్యవస్థ మారాలి

  • ఆంధ్రజ్యోతితో యూకే ముస్లిం ట్రేడ్‌ ఫోరం చైర్మన్‌ ఇక్బాల్‌ సక్రాని

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో మానవాళి ఎదుర్కొంటున్న పలు సంక్షోభాలకు కారణం అభివృద్ధి చెందిన దేశాలే అయినా, ఆ సంక్షోభాల వల్ల సమస్యల పాలవుతున్నది మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలని ‘యూకే ముస్లిం ట్రేడ్‌ ఫోరం’ చైర్మన్‌ ఇక్బాల్‌ సక్రాని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రిటన్‌ నుంచి వచ్చిన ఇక్బాల్‌ ‘కొత్త ప్రపంచం కోసం కొత్త ఆర్థిక ఒప్పందం’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో పాల్గొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.


కొత్త ప్రపంచం కోసం కొత్త ఆర్థిక ఒప్పందం అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు గ్లోబల్‌ సౌత్‌ (అభివృద్ధి చెందుతున్న దేశాల) బాధ్యత లేదు. కానీ అధిక ధరలు, జీవనవ్యయం, ఆర్థిక మందగమనం వంటి భారీ మూల్యాన్ని అవే చెల్లిస్తున్నాయి. గ్లోబల్‌ నార్త్‌(అభివృద్ధి చెందిన దేశాలు)-గ్లోబల్‌ సౌత్‌ మధ్య సమతుల్యత సాధించాలి. సమానత్వం, భాగస్వామ్యం, పరస్పర సమస్యల అవగాహన ఆధారంగా శాంతియుత సహజీవనం సాధ్యమయ్యేలా ఈ దేశాల మధ్య భాగస్వామ్యం ఉండాలి.


ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎవరు లబ్ధి పొందుతున్నారు?

సహజ వనరులు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అక్కడ ఆ వనరులతో సరుకులు, ఉత్పత్తులు తయారుచేసి.. మళ్లీ వాటిని అభివృద్ధి చెందిన దేశాలకే ఎగుమతి చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన వ్యవస్థ. ప్రపంచబ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే సహజ వనరులను ఉత్పత్తులుగా మార్చటానికి వీలుగా మౌలికసదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి.


ప్రపంచ ఆర్థిక వ్యవస్థ న్యాయబద్ధంగా ఉండాలంటే ఏ మార్పులు రావాలి?

ఉన్నత స్థాయి నుంచే విధానాలు మారాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా అంతర్జాతీయ రుణాలపై ఆధారపడుతున్నాయి. ఆ రుణాలకు భారీ వడ్డీలు చెల్లించి దీర్ఘకాలం అప్పుల్లోనే ఉంటున్నాయి. దీనిని నివారించాలంటే ఆయా దేశాల్లో మౌలిక సదుపాయాలను, జీడీపీని పెంచే ప్రాజెక్టులకు రుణాలు, ఆర్థికసాయం అందించే విషయంలో అనుకూలమైన నిబంధనలు ఉండాలి.


ఈ అంశంలో భారత్‌ పాత్ర ఎలా ఉండాలి?

భారత్‌ ప్రస్తుతం అత్యంత శక్తిమంతమైన, అభివృద్ధి చెందుతున్న సూపర్‌ పవర్‌ దేశాల్లో ఒకటి. మానవ వనరుల పరంగానే కాకుండా, పారిశ్రామికాభివృద్ధి పరంగా కూడా నూతన ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగింది. భారత్‌ తన పరిశ్రమలు, మౌలిక సదుపాయాలతో గ్లోబల్‌ సౌత్‌లోని ఇతర దేశాల అభివృద్ధికి సహకరించాలి.


ఇటీవల అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి?

యూరప్‌ దేశాల్లోనూ విద్య, ప్రాథమిక సదుపాయాలు, ఉపాధ్యాయుల లభ్యత వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా లేక.. తాము వంచనకు గురయ్యామన్న భావన యువతలో నెలకొంది. ఏళ్ల తరబడి నిరసన తెలిపినా ఫలితం లేకపోవడంతో రోడ్లెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. వారు హింసాత్మక మార్గాలను ఆశ్రయించకుండా ప్రభుత్వాలు ముందుగానే స్పందించి, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చల ద్వారాసమస్యలు పరిష్కరించాలి.


అమెరికా-ఇరాన్‌ యుద్ధంపై మీ అభిప్రాయం?

ఇరాన్‌ విషయంలో అమెరికా వ్యవహరించిన తీరు సరికాదని స్వయంగా ఆ దేశ ప్రజలే భావించారు. ఇటీవలి ఎన్నికల్లో ట్రంప్‌ పార్టీ రిపబ్లికన్ల పతనానికి ఇది ఒక ప్రధాన కారణం. బలం ఉన్నంత మాత్రాన అది పని చేయదని, అధికార దుర్వినియోగం సరికాదని అమెరికా ప్రభుత్వం నేర్చుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలను గౌరవించాలి. లేదంటే ప్రపంచం మొత్తం మ్యూలం చెల్లించాల్సి వస్తుంది.


భారత్‌ సమ్మిట్‌ ప్రపంచానికి ఏ సందేశం ఇవ్వనుంది?

ఇది వ్యాపార, రాజకీయ, సామాజిక నాయకులనే కాకుండా.. యువతరాన్ని, అనుభవ జ్ఞులను ఒక చోట చేర్చే ముఖ్యమైన సదస్సు. గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకుని, చర్చించుకుని, అందరూ సుఖసంతోషాలతో, ప్రశాంతంగా జీవించే సమన్యాయ ప్రపంచాన్ని నిర్మించేందుకు ‘భారత్‌ సమ్మిట్‌’ వేదిక కావాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 05:35 AM