Share News

ఎకరం 250 కోట్ల ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ టవర్లు

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:05 AM

తమ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం నగరానికి 40 కి.మీ దూరంలో ఇళ్లు కట్టిస్తే పేదవాడి కష్టం తెలిసిన ప్రజా ప్రభుత్వం క్యూర్‌ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో...

ఎకరం 250 కోట్ల ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ టవర్లు
Ponguleti Srinivas Reddy

  • గత సర్కారు హైదరాబాద్‌కు 40కి.మీ దూరంలో కట్టించింది

  • వారు పదేళ్లలో కట్టిన ఇళ్లకన్నా ఇప్పటికే రెట్టింపు ఇళ్లు కట్టాం

  • ఫ్లాట్‌ విలువ 80 లక్షలు.. ఏడాదిలోపే పూర్తిచేసి తాళాలిస్తాం

  • రిజిస్ట్రేషన్‌ చార్జీల్లేకుండా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు: పొంగులేటి

  • నాంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల శంకుస్థాపన

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం నగరానికి 40 కి.మీ దూరంలో ఇళ్లు కట్టిస్తే పేదవాడి కష్టం తెలిసిన ప్రజా ప్రభుత్వం క్యూర్‌ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో ఎకరా రూ.200-250 కోట్ల విలువ కలిగిన స్థలాల్లో వారి కోసం ఇందిరమ్మ ఇళ్ల టవర్లు కట్టించి అందచేస్తోందన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్‌, ఎంపీ అనిల్‌ యాదవ్‌, ఎమ్మెల్యే మాజీద్‌ హుస్సేన్‌, శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు.


గత ప్రభుత్వం పదేళ్లలో కట్టిన ఇళ్లకన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదటి విడతలోనే రెట్టింపు ఇళ్లు నిర్మించి చూపిస్తోందన్నారు. తన జీవిత కాలంలో ఒక్కసారైనా సొంతింటిని చూసుకోవాలన్న పేదవాడి ఆకాంక్షను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. క్యూర్‌ (జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల భూములను గుర్తించి వాటిని హౌసింగ్‌శాఖకు బదలాయించి పేదల కోసం గ్రౌండ్‌ ప్లస్‌ పదంతస్తులతో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పారదర్శకంగా నిర్వహించిన డ్రాలో 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, మిలిలిన వారికి రెండో, మూడో, నాలుగు విడతల్లో ఇళ్లు అందిస్తామని తెలిపారు. 20 నియోజకవర్గాల్లో భూములు గుర్తించామని, సుమారు 16-17 ప్రాంతాల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.


గత ప్రభుత్వం నగరంలో పేదలు నివసించే ప్రాంతాలకు 30-40 కి.మీ దూరంలో ఇళ్లు నిర్మించడం వల్ల జీవనోపాధి కోసం వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి విమర్శించారు. పేదల జీవనోపాధి, పిల్లల చదవులు, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను తాము ఎంపిక చేస్తున్నామన్నారు. పేదల సొంతింటి కలను ఎన్నికల హామీగా కాకుండా, ప్రభుత్వ బాధ్యతగా భావించి అమలు చేస్తున్నామన్నారు. ఎంపికైన 480 మంది లబ్ధిదారులకు మంత్రి అభినందనలు తెలిపారు. రాబొయే రోజుల్లో రెండో, మూడో, నాలుగో విడతలను ప్రారంభించి, ఎన్నికలలోపు నాలుగు విడతల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్కో ఫ్లాట్‌ విలువ సుమారు రూ.80లక్షల నుంచి కోటి వరకు ఉంటుందన్నారు.


రెండు, మూడేళ్ల సమయం తీసుకోకుండా ఒక ఏడాదిలోపే నిర్మాణాలు పూర్తిచేసి, ఇదే వేదిక నుంచి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తామన్నారు. గతంలో మాదిరిగా కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి వదిలేయకుండా అవసరమైతే పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ అవసరాలకోసం రుణం పొందే అవకాశం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మేరకు రూపాయి కమిషన్‌ లేకుండా, రిజిస్ట్రేషన్‌ చార్జీలు లేకుండా నేరుగా లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా లక్కీడ్రాలో ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల నంబర్లు కేటాయించి వారి పేర్లను ప్రకటించారు. మంత్రి చేతుల మీదుగా మాదేసు లత అనే మహిళకు డ్రాలో ఇందిరమ్మ టవర్స్‌లోని ఏ బ్లాక్‌లో 801 ఇంటిని కేటాయిస్తూ ప్రకటించారు. దీంతో ఆ మహిళ ఆనందబాష్పాలతో మంత్రి పొంగులేటికి, స్థానిక ఎమ్మెల్యేకు కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...
నవంబరు 19 నుంచి రాజీవ్‌ యువ వికాసం

బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అన్నారా..?: పొన్నం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 05:05 AM