Share News

నవంబరు 19 నుంచి రాజీవ్‌ యువ వికాసం

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:59 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి, వారి ఆర్థిక ఉన్నతిని కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది.

నవంబరు 19 నుంచి రాజీవ్‌ యువ వికాసం
Rajiv Yuva Vikasam scheme

  • పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

  • గతంలో వాయిదా పడిన పథకానికి మోక్షం

  • దాదాపు 16.31 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి, వారి ఆర్థిక ఉన్నతిని కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని వచ్చే నవంబరు 19వ తేదీన లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఈ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్లు లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం లేదా సబ్సిడీ (రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకు) అందిస్తుంది.


ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రూ.6,240 కోట్లు కేటాయించింది. ఈ పథకానికి దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర వ్యాప్తంగా 16,30,522 దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం తొలివిడతను గతేడాది జూన్‌ 2న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుని చివరి నిమిషంలో వాయిదా వేశారు. అయితే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ పథకాన్ని నవంబరులో ప్రారంభించాలని ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ఇప్పటికే అందిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేయాలని సూచించారు.


తొలి విడతగా రూ.50వేల నుంచి రూ.లక్ష లోపు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, క్రిస్టియన్‌ మైనార్టీస్‌ కార్పొరేషన్ల వారీగా రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించారు. రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు యూనిట్‌ ధర నిర్ణయించగా ఎక్కువమంది రూ.లక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని కార్పొరేషన్లకు కలిపి రూ.50వేల లోపు విభాగంలో 1.59లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా 54,822 మంది దరఖాస్తు చేసుకున్నారు.


రూ.50వేల నుంచి రూ.లక్ష లోపు 1.23లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని భావించినా 1.07లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక రూ.లక్షకు పైన విభాగానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 1.07లక్షల మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 2.61లక్షల దరఖాస్తులు వచ్చాయి. రూ.2 నుంచి రూ.4లక్షల వరకు 1.05 లక్షల మందికి ఇవ్వాలని అనుకోగా.. 12.08లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతగా రూ.లక్ష లోపు విభాగంలో 2,81,190 మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించగా 1,61,899 దరఖాస్తులే వచ్చాయి. దీంతో వీరంతా తొలి విడతలో లబ్ధిదారులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది.


పారదర్శకతకు పెద్దపీట

ప్రభుత్వం మొదటి విడత కింద రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు ఆర్థిక సహాయం/యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. రూ.లక్ష లోపు రుణ సాయానికి పూర్తి రాయితీ ప్రకటించడంతో లబ్ధిదారు రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.


ఇవి కూడా చదవండి...
హిందూ దేవుళ్లను విభజిస్తారా?

బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అన్నారా..?: పొన్నం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 04:59 AM