Share News

హిందూ దేవుళ్లను విభజిస్తారా?

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:49 AM

హిందూ దేవుళ్లను విభజిస్తూ వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

హిందూ దేవుళ్లను విభజిస్తారా?
Ramchander Rao

  • రేవంత్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలి

  • సీఎం మానసిక ఆరోగ్య పరిస్థితి క్షీణించింది

  • ఓట్ల కోసం దేవుళ్లను దూషిస్తున్నారు

  • ఆయనకు పూజలు చేసే హక్కు లేదు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • రాహుల్‌గాంధీకి పెళ్లి కాకపోవడానికీ

  • ఈవీఎంలదే బాధ్యత అంటారా? అని ఎద్దేవా

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవుళ్లను విభజిస్తూ వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ‘కులం, మతం, ఉత్తరాది, దక్షిణాది పేరిట భారత్‌ను విభజించిన మీరు, ఇప్పుడు హిందూ దేవుళ్లను కూడా విభజిస్తారా? ముస్లింలే కాంగ్రెస్‌, కాంగ్రెస్సే ముస్లింలు అని ప్రకటించినప్పుడే మీరు రేవంతుద్దీన్‌ అయిపోయారు. ఇప్పుడు కల్మా చదివి రాముడు వేరు, శివుడు వేరు అంటారా?’ అని మండిపడ్డారు. ‘శివుడు పేదల దేవుడు.. రాముడు ధనవంతుల దేవుడు’ అని రేవంత్‌ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.


హిందూ దేవుళ్లను అవమానించిన రేవంత్‌కు ఏ గుడిలోనూ పూజ లు చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం పలువురు వైద్యులు బీజేపీలో చేరారు. అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘ఏ కష్టం వచ్చినా మనం దేవుడినే గుర్తు చేసుకుంటాం.. ఆ దేవుడు రాముడు, కృష్ణుడు లేదా శివుడు కావొచ్చు.. ఈ మధ్య భూములు విక్రయించడంతో డబ్బులు బాగా వచ్చాయి.. అందుకే రేవంత్‌కు ఇప్పుడు కష్టాలు లేవు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ముస్లింల ఓట్ల కోసం సీఎం రేవంత్‌, హిందూ దేవుళ్లను దూషిస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లను పూజించకున్నా ఫరవా లేదు గానీ.. అవమానపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.


ప్రతీ దేవుడూ పేదల దేవుడేననే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘సోనియా, రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇది కాంగ్రెస్‌ పాలసీగా మారిపోయింది. రాహుల్‌తో దోస్తానా పెంచుకున్న రేవంత్‌ కూడా ఆయనలానే ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేకి.. అది ఇండియన్‌ ముస్లిం కాంగ్రెస్‌’ అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మానసిక స్థితి క్షీణించిందని, మతి ఉన్నవారెవరూ ఇలాంటి మా టలు మాట్లాడరని అన్నారు. ఆయనకు సరైన కౌన్సెలింగ్‌, చికిత్స ఇప్పించాలని బీజేపీలో చేరిన వైద్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


కాగా, రాహుల్‌గాంధీకి పెళ్లి కాకున్నా, ఆయన ప్రధాని కాకున్నా ఈవీఎంలదే బాధ్యత అంటారా? అని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. పెళ్లి కావడం, ప్రధాని కావడం రాహుల్‌ జాతకంలో లేదని, దానికి బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌, ‘ఇండి’ కూటమి పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిస్తే వ్యవస్థలు మంచివని, ఓడిపోతే ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌ బూటకమని మాట్లాడడం కాంగ్రెస్‌ నైజమని ఆయన విమర్శించారు.


భవిష్యత్తు సమరానికి ఇది పరీక్ష

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు 76 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపనున్నాయని, భవిష్యత్‌లో జరగబోయే రాజకీయ సమరానికి ఇది ఓ పరీక్ష లాంటిదని రాంచందర్‌ రావు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఖైరతాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా రాంచందర్‌ మాట్లాడుతూ రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకి అత్యంత ముఖ్యమైనవని, ఇప్పటికే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అన్ని స్థాయిల్లో సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక విధానాలను తెలంగాణ మేధావులు, పట్టభద్రులు నిశితంగా గమనిస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపై నిలిచి అభ్యర్థుల గెలుపు కోసం అంకితభావంతో పని చేయాలని, రెండు స్థానాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధిస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని అన్నారు.


ఇవి కూడా చదవండి...
నీ చేతగానితనాన్ని అధినేతపై రుద్దుతావా?

నిమ్స్‌ లక్ష్మీ భాస్కర్‌ కేసులో మరో 3.5 కోట్ల ఆస్తులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 04:50 AM