Share News

నీ చేతగానితనాన్ని అధినేతపై రుద్దుతావా?

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:39 AM

‘మీ ఫామ్‌హస్‌లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు, ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు, క్విడ్‌ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?’’ ..అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత ధ్వజమెత్తారు.

నీ చేతగానితనాన్ని అధినేతపై రుద్దుతావా?
Kalvakuntla Kavitha

  • ఆంధ్రా దోస్తులకు నజరానాలు..

  • క్విడ్‌ప్రోకోలతో పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరే

  • నేను నీలాగా విషనాగుల మాటలు విని మాట్లాడను

  • కేటీఆర్‌పై కవిత ధ్వజం

  • కొంగరఖుర్దు(ఏ)లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ భూ మాఫియా!

  • రూ.5 వేల కోట్ల విలువైన భూములు కొల్లగొడుతున్నారు

  • ఆ రిజిస్ట్రేషన్లు రద్దుచేయాలి..

  • లేదంటే ప్రభుత్వాన్ని కోర్టుకీడుస్తా: కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ ఫామ్‌హస్‌లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు, ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు, క్విడ్‌ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?’’ ..అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత ధ్వజమెత్తారు. ‘‘మన ప్రభుత్వంల కేసీఆర్‌ ఒక నిర్ణయం తీసుకున్నరు. మంత్రి ఎవరున్నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలదే నడ్వాలె అన్నరు. ‘నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి. అక్కడ వేరేవాళ్లు వేలు పెట్టొద్ద’ని చెప్పిన్రు. ఇదే మనం చేసిన తప్పు’’ అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను బీఆర్‌ఎస్‌లో ఒక నాయకుడిని విమర్శిస్తే కొన్ని గంటల్లోనే తనను పార్టీనుంచి సస్పెండ్‌ చేశారని.. ఇప్పుడు అదే నాయకుడితో అంటకాగుతూ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం పార్టీకి వ్యతిరేకం కాదా? అని కేటీఆర్‌ను ఆమె నిలదీశారు.


‘‘పెద్దమనిషినే తప్పుబడుతున్నావ్‌. బీఆర్‌ఎ్‌సకు గోతిని తవ్వుతున్నావ్‌’’ అని దుయ్యబట్టారు. తాను విషనాగుల చెరలో లేనని, ఎవరో చెప్పేమాటలు విని ఏదిపడితే అది మాట్లాడబోనని... ఏ విషయమైనా నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతానని.. తనతో పెట్టుకోవద్దని మంగళవారం ఎక్స్‌ వేదికగా కవిత కేటీఆర్‌ను హెచ్చరించారు. ‘‘కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని, మీ చేతగానితనాన్ని బీఆర్‌ఎస్‌ అధినేతపై మోపుతున్నావు అంటే.. ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానమేంటో అర్థమవుతోందా?’’ అని కవిత ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఒక రైతు ఫోన్‌ మాట్లాడుతుంటే ‘‘నీ పెండ్లామా!? అంత అర్జెంటా!?’’ అని అహంకారంతో అతని భార్యను అవమానించారని..’’ గతంలో సాయం కోసం వెళ్లిన మహిళను ‘‘నా కోసం కన్నావా’’ అని ఆమె మాతృత్వాన్ని అవమానించారని కవిత గుర్తుచేశారు.


భూముల్ని కొల్లగొడుతున్నరు..

రంగారెడ్డి జిల్లా కొంగరఖుర్దు (ఏ) గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి రూ.5 వేల కోట్ల విలువైన 580 ఎకరాల వక్ఫ్‌ భూమిని కొల్లగొడుతున్నారని కవిత ఆరోపించారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో కొంగరఖుర్దు (ఏ) గ్రామానికి చెందిన భూబాధితులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ 580 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలు భూ మాఫియా చెరలోకి వెళ్లిపోయిందని.. నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్‌ భూములు ఎలా రిజిస్ట్రేషన్‌ అయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అర్బన్‌ క్రెస్ట్‌, సిటీ గ్రాండ్‌ ఎన్‌ క్యూ వెంచర్స్‌ అనే సంస్థలు అక్కడ భారీ వెంచర్లు వేశాయని తెలిపిన ఆమె.. నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూముల్లో లే ఔట్‌ పర్మిషన్‌ ఎలా ఇచ్చారని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను ప్రశ్నించారు. వెంటనే ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలన్నారు.


2022 నుంచి ఆ భూముల్లో కబ్జాలు మొదలయ్యాయని.. ఒక రైతు 58ఎకరాల్లో పంటలు సాగుచేేస్త మూడు జేసీబీలతో పంటను ధ్వంసంచేసి లే ఔట్‌ వేశారని కవిత తెలిపారు. భూ మాఫియా ఆగడాలపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా కనీసం కేసులు కూడా నమోదు చేయడంలేదని, ఆ గ్రామంతో సంబంధంలేని వారి పేర్లతో ఓఆర్సీలు సృష్టించి వాటితో కోర్టుల్లో కేసులు వేసి అనుకూలంగా జడ్జిమెంట్‌లు తెచ్చుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఈ భూ కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’లో ఒకరోజు, ‘సాక్షి’ పత్రికలో ఒకరోజు కథనాలు ప్రచురితమయ్యాయని.. ఆ తర్వాత ఒక్కముక్క వార్తకూడా ఆ పత్రికల్లో రాలేదని, దాని వెనుక బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడు ఉన్నారని కవిత మండిపడ్డారు. సాక్షిలో భూమాఫియాకు వ్యతిరేకంగా ఆర్టికల్‌ వచ్చిన మర్నాడే రైతులకు వ్యతిరేకంగా కథనం రాశారని ఆమె పేర్కొన్నారు.


తనకు ఈ మధ్యనే ఒక విషయం తెలిసిందని.. అదేంటంటే.. రామన్న - జగనన్న దోస్తులు అయ్యారని, అందుకే సాక్షిలో రైతులకు వ్యతిరేకంగా కథనాలు రాశారని అన్నారు. ముందురోజు భూమాఫియాకు వ్యతిరేకంగా కథనం వస్తే.. తెల్లారే దాన్ని రైతులకు వ్యతిరేక కథనంగా మార్చడం వెనుక ఏ శక్తులు ఉన్నాయని ప్రశ్నించిన ఆమె.. బీఆర్‌ఎస్‌ దీనికి సమాధానం చెప్పి తీరాలన్నారు. ఈ రోజు కూడా కొంగరకుర్దు భూముల్లో నిషేధిత జాబితాలో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులే స్పష్టం చేస్తున్నాయన్నారు. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్న అర్బన్‌ క్రెస్ట్‌, సిటీ గ్రాండ్‌ఎన్‌ క్యూ వెంచర్స్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్‌చేశారు. ఆ రెండు సంస్థలు ఇకపై ఒక్కగజం మేర వెంచర్‌ను విస్తరించినా.. ఒప్పుకోబోమని, ఆ భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేయకుంటే రంగారెడ్డి కలెక్టర్‌, ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...
కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సామ రామ్మోహన్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి
నేడు సిరిసిల్లకు సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 04:39 AM