Share News

నిమ్స్‌ లక్ష్మీ భాస్కర్‌ కేసులో మరో 3.5 కోట్ల ఆస్తులు

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:44 AM

నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ లక్ష్మీభాస్కర్‌ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో ఆయనకు బినామీలుగా ఉన్న నిమ్స్‌ ఉద్యోగుల ఇళ్లల్లో మంగళవారం సోదాలు నిర్వహించి మరిన్ని ఆస్తులను గుర్తించారు.

నిమ్స్‌ లక్ష్మీ భాస్కర్‌ కేసులో మరో 3.5 కోట్ల ఆస్తులు
NIMS Lakshmi Bhaskar

  • బినామీల ఇళ్లల్లో ఏసీబీ అధికారుల సోదాలు

  • నిమ్స్‌ బార్బర్‌ ఇంట్లో రూ.4.94 లక్షల నగదు

  • బంజారాహిల్స్‌ లో 2.70 కోట్ల విలువైన స్థలం

  • మహేశ్వరంలో రూ.57లక్షల విలువైన 3 స్థలాలు

  • రూ.9.63 కోట్లకు చేరిన లక్ష్మీ భాస్కర్‌ ఆస్తులు

  • మార్కెట్‌ విలువ రూ.100 కోట్ల పైనే: ఏసీబీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ లక్ష్మీభాస్కర్‌ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో ఆయనకు బినామీలుగా ఉన్న నిమ్స్‌ ఉద్యోగుల ఇళ్లల్లో మంగళవారం సోదాలు నిర్వహించి మరిన్ని ఆస్తులను గుర్తించారు. దాదాపు రూ.3.5 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు ఈ సోదాల్లో బయటపడ్డాయి. నిమ్స్‌లో బార్బర్‌గా పనిచేస్తున్న ధన్‌రాజ్‌ అనే ఉద్యోగి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.4.94 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరంలో రూ.57లక్షల విలువైన మూడు స్థలాలు, బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని వెంకటేశ్వర కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో రూ.2.70 కోట్ల ఖాళీ స్థలానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.


నిమ్స్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న గణేష్‌ ఇంట్లో రూ.20 లక్షల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను, ప్రైవేటు వ్యక్తికి అప్పుగా ఇచ్చిన రూ.3 లక్షల ప్రామిసరీ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రూ.20 లక్షల పెట్టుబడులు గణేష్‌ పేరిటే ఉన్న నేపథ్యంలో బినామీల పేరిట లక్ష్మీ భాస్కర్‌ భారీగానే పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల 21న లక్ష్మీ భాస్కర్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి రూ.6.13 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకోగా తాజాగా బయటపడిన వివరాలతో లక్ష్మీ భాస్కర్‌ ఆస్తులు రూ.9.63 కోట్లకు చేరింది.


వాస్తవానికి ఈ ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీ భాస్కర్‌ బినామీల ఇళ్లల్లో మంగళవారం సోదాలు జరగడంతో నిమ్స్‌ ఉద్యోగుల్లో కలకలం నెలకొంది. లక్ష్మీ భాస్కర్‌ దాదాపు 20 ఏళ్లుగా పరిపాలన విభాగంలోనే పనిచే స్తుండటం, తాత్కలిక ఉద్యోగుల నియామకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న క్రమంలో తాజా ఏసీబీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...
నీ చేతగానితనాన్ని అధినేతపై రుద్దుతావా?

నేడు సిరిసిల్లకు సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 04:44 AM