ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి కాంతులు!
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:52 AM
రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి కాంతులు మిరుమిట్లుగొలపనున్నాయి. ఈ పథకం కింద మంజూరై, గృహ ప్రవేశం చేసినవారి ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో వేడుకలను నిర్వహించనున్నారు.
‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో వేడుకలకు హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన రెండు లక్షల ఇళ్ల వద్ద సంబురాలు
నిర్వహణపై క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు జారీ
లబ్ధిదారులు ఇల్లు కనిపించేలా ఫొటో తీసుకుని.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేలా సూచనలు
‘క్యూర్’ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్
నిర్మాణ స్థలాల్లోనూ దీపావళి సంబురాలు
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి కాంతులు మిరుమిట్లుగొలపనున్నాయి. ఈ పథకం కింద మంజూరై, గృహ ప్రవేశం చేసినవారి ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో వేడుకలను నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల నుంచి కలెక్టర్ల వరకు అధికారులు.. ఎమ్మెల్యేల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వరకు ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన సుమారు 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్ల వద్ద లబ్ధిదారుల వేడుకల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందికి గృహనిర్మాణ కార్పొరేషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన దాదాపు 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల దగ్గర దీపాలు వెలిగించి దీపావళి పండుగను మరింత శోభాయమానం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని గృహనిర్మాణ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ ప్రాంతాల్లో పండుగ రోజు సాయంత్రం 4 గంటలకు దీపావళి సంబురాలను నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది దీపావళి నాటికి లబ్ధిదారులు కొత్త ఇళ్లలో పండుగ జరుపుకొనేలా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. అందులో 2.06 లక్షల మేర ఇళ్లు పూర్తయ్యాయని, ఆ ఇళ్లకు సంబంధించి ఇప్పటివరకు సుమారు రూ.8వేల కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు.
కార్యక్రమం నిర్వహణ ఇలా..
‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల నిర్వహణకు సంబంధించి జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగిస్తూ గృహనిర్మాణ కార్పొరేషన్ ఎండీ సర్క్యులర్ జారీ చేశారు. దాని ప్రకారం.. జిల్లాలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను గుర్తించి, లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలతో కలిసి ఇళ్లను సందర్శించాలి. ఇళ్ల ముందు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ లోగో స్టిక్కర్‌ను అతికించాలి. ఇంటిముందు గోడపై పెయింటింగ్‌తో లబ్ధిదారుల వివరాలను రాయాలి. లబ్ధిదారుల కుటుంబ సభ్యులంతా ఇంటిముందు దీపం వెలిగించి, ఫొటో దిగాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి కనీసం రెండు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఫొటోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయాలి. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు ఇందిరమ్మ ఇళ్లు, టీజీహెచ్‌డీ.అఫీషియల్, తెలంగాణసీఎంవో హ్యాష్‌ట్యాగ్‌లను జతచేయాలి. ప్రతీ గ్రామంలో ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటుచేయాలి. స్టిక్కర్లు వేయడం, గోడలపై లబ్ధిదారుల సమాచారాన్ని రాసే పనులను శనివారం నాటికే పూర్తిచేయాలి. ఈ ప్రక్రియకు సంబంధించి దీపావళి వేడుకల లోగో స్టిక్కర్ నమూనా, లబ్ధిదారుల వివరాలు గోడపై రాసే పెయింటింగ్ నమూనా, సెల్ఫీ ఫొటోఫ్రేమ్ నమూనాలను జతచేశారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లోనూ వేడుకలు నిర్వహించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News