Share News

ప్రభుత్వ బీమా పథకాలన్నీ.. ఒకే గొడుగు కిందకు!

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:05 AM

ప్రస్తుతం వివిధ శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.

ప్రభుత్వ బీమా పథకాలన్నీ.. ఒకే గొడుగు కిందకు!
Revanth Reddy

  • కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా

  • రూ.2 లక్షల జీవిత బీమా..

  • 10 లక్షల ప్రమాద బీమా

  • రేపు సిద్దిపేట సభలో బీమా దరఖాస్తు విడుదల

  • అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు

  • అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వివిధ శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలన్నారు. గురువారంసిద్దిపేటలో జరగనున్న బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తును సీఎం విడుదల చేయనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇందిర్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై అధికారులతో తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు బీమా పథకం అమలయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


ఇందిరమ్మ బీమా పథకం కింద ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా లభిస్తుందని, దీంతో ఉపాధి హామీ కూలీలతోపాటు లక్షలాది మంది పేదలు లబ్ధి పొందుతారని అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల కింద రూ.2 లక్షల జీవిత బీమా, రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు అధికారులు తెలపగా.. రూ.2 లక్షలు ఉన్న జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి రూ.5 లక్షలకు పెంచాలని సీఎం సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ తొలగించవద్దని తేల్చి చెప్పారు.


ఇందిరమ్మ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని, బీమా దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు దీనిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇక రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకూ ఇందిరమ్మ చీర అందాలని, ఈ మేరకు చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీధర్‌, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 04:07 AM