Share News

గుడ్ల ఉత్పత్తిలో భారత్‌ను అగ్రగామిగా నిలపటమే లక్ష్యం!

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:55 AM

దేశంలో గుడ్ల ఉత్పత్తిని మరింత పెంచి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ భగేల్‌ తెలిపారు.

గుడ్ల ఉత్పత్తిలో భారత్‌ను అగ్రగామిగా నిలపటమే లక్ష్యం!

  • ‘వికసిత్‌ భారత్‌-2047’ లక్ష్యంలో పౌల్ట్రీది కీలక పాత్ర

  • 149 బిలియన్లకు చేరిన గుడ్ల ఉత్పత్తి: కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్‌

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో గుడ్ల ఉత్పత్తిని మరింత పెంచి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ భగేల్‌ తెలిపారు. వికసిత్‌ భారత్‌-2047 సాధనలో పౌల్ట్రీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో- 2026’లో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు ఈటల రాజేందర్‌, డాక్టర్‌ లక్ష్మణ్‌లతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.


మొక్కజొన్న, సోయాబీన్‌ ధరల పెరుగుదల పౌల్ట్రీ పరిశ్రమకు భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్‌ తయారీకి మొక్కజొన్న వాడకం పెరుగుతుండటంతో పౌల్ట్రీకి కొరత ఏర్పడుతోందని చెప్పారు. మొక్కజొన్న దిగుమతుల అనుమతులివ్వాలన్న పౌల్ట్రీ సంఘాల విజ్ఞప్తిని వాణిజ్య, పరిశ్రమల శాఖకు పంపించామని, త్వరలోనే ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో గుడ్ల ఉత్పత్తి 2014- 15లో 78.48 బిలియన్లుగా ఉండగా, 2024-25 నాటికి 149.11 బిలియన్లకు చేరి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచామని ఆయన అన్నారు.


సింగిల్‌ విండోలో పౌల్ట్రీ రంగానికి అనుమతులు: మంత్రి వాకిటి

రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్‌ విండో విధానంలో యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేస్తున్నామన్నారు. పౌల్ట్రీ పరిశ్రమల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేలా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రంగంలో దేశంలో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 04:55 AM