Share News

ఐఐటీహెచ్‌లో బీటెక్‌ విద్యార్థులకు పరిశోధనావకాశం

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:24 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ మరో వినూత్న అవకాశాన్ని అందిస్తోంది.

ఐఐటీహెచ్‌లో బీటెక్‌ విద్యార్థులకు పరిశోధనావకాశం
IIT Hyderabad Internship 2026

  • మెకానికల్‌, ఏరోస్పేస్‌ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌

  • దరఖాస్తులకు డిసెంబరు 10 వరకు గడువు

కంది, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ మరో వినూత్న అవకాశాన్ని అందిస్తోంది. సంస్థలోని మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ‘మాస్ట్రో’ (మెకానికల్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ రీసెర్చ్‌ ఆపర్చునిటీ) పేరుతో సెమిస్టర్‌ కాలపరిమితితో పరిశోధన ఇంటర్న్‌షి్‌పకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చివరి సంవత్సరం బీఈ, బీటెక్‌ చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఐఐటీహెచ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.


మెకానికల్‌, ఏరోస్పేస్‌, ప్రొడక్షన్‌, రోబోటిక్స్‌, మెకాట్రానిక్స్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు అర్హులు. అయితే తమ కోర్సులోని మొత్తం విద్యార్థుల్లో విద్యాపరంగా మొదటి 20శాతం స్థానాల్లో ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలి. ఐఐటీహెచ్‌లో చదువుతున్న విద్యార్థులు అనర్హులు. ఎంపికైన విద్యార్థులకు ఐఐటీహెచ్‌ ప్రాంగణంలోనే వసతి సౌకర్యం కల్పిస్తారు. సుమారు 14 వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ అధ్యాపకుల మార్గదర్శకత్వంలో పరిశోధన ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా రూ.7 వేల చొప్పున ఉపకార వేతనం అందజేస్తారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ (సీఎఫ్‌డీ), డ్రోన్‌ సాంకేతికత, డిజిటల్‌ ట్విన్స్‌, మెటామెటీరియల్స్‌ వంటి పరిశోధనా రంగాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు డిసెంబరు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:24 AM