భాగ్యనగరం
ABN , Publish Date - Aug 30 , 2026 | 05:31 AM
పార్కులు, చెరువులు, ట్యాంక్‌బండ్ వంటి ఆహ్లాదభరిత పర్యావరణంతో చల్లగా ఉండే హైదరాబాద్.. కాంక్రీట్ నిర్మాణాలతో క్రమేణా నిప్పుల కుంపటిగా మారుతోంది. గత 13 ఏళ్లలో నగరం ఉపరితల ఉష్ణోగ్రతలు ఏకంగా 4.4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
రాజధాని ఉపరితల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
గత 13 ఏళ్లలో 4.4 డిగ్రీలు అధికం
28.6 డిగ్రీల సెల్సియస్ నుంచి 33 డిగ్రీలకు
చెట్లు, చెరువులు, పార్కులు కనుమరుగై
రోడ్లు, భారీ భవనాలు వెలుస్తుండటం వల్లే..
మెట్రోపాలిటన్‌లో 24 శాతమే పచ్చదనం
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పార్కులు, చెరువులు, ట్యాంక్‌బండ్ వంటి ఆహ్లాదభరిత పర్యావరణంతో చల్లగా ఉండే హైదరాబాద్.. కాంక్రీట్ నిర్మాణాలతో క్రమేణా నిప్పుల కుంపటిగా మారుతోంది. గత 13 ఏళ్లలో నగరం ఉపరితల ఉష్ణోగ్రతలు ఏకంగా 4.4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. భూమి, రోడ్లు, పైకప్పులు, భవనాలు వంటి వాటి మీద ఉన్న ఉష్ణోగ్రతలను ఉపరితల ఉష్ణోగ్రతలుగా లెక్కిస్తారు. వాతావరణ శాఖ నమోదు చేసే ఉష్ణోగ్రతలు గాలిలోని వేడిని వెల్లడిస్తాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూగోళశాస్త్రం విభాగానికి చెందిన ప్రొఫెసర్ బత్తుల శ్రీనగేశ్ 2012-2018 మధ్య కాలంలో తీసిన ఉపగ్రహ చాయాచిత్రాలను 2019-2025 మధ్య తీసిన వాటితో పోల్చి ఉష్ణోగ్రతల పరంగా సంభవించిన మార్పులపై అధ్యయనం జరిపారు. 2012-2018 మధ్య హైదరాబాద్ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 28.6 సెల్సియస్ కాగా.. ఆ తదుపరి ఆరేళ్లలో (2019-2025) అది 33 డిగ్రీల సెల్సియ్‌సకు పెరిగిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. గరిష్ఠ ఉపరితల ఉష్ణోగ్రత కూడా 33.2 డిగ్రీల నుంచి 39.7 డిగ్రీల వరకు పెరిగింది. భవనాలు, రోడ్ల నిర్మాణాల పెరుగుదలే దీనికి కారణమని తెలిసింది. అంతకుముందు చెట్లతో ఉన్న ఖాళీ ప్రదేశాలు కనుమరుగై వాటి స్థానంలో కాంక్రీట్ భవంతులు, రోడ్లు ఉనికిలోకి వస్తున్నాయి. భవనాలు, రోడ్ల వంటి కాంక్రీట్ నిర్మాణాలు వేడిని చాలాసేపు తమలోనే నిలుపుకొంటాయి. తద్వారా ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోంది.
కాంక్రీట్ వనాలు
ఒకప్పుడు ఉద్యానవనాలకు కేరాఫ్ అడ్ర్‌సగా నిలిచిన హైదరాబాద్ నేడు కాంక్రీట్ వనాలకు చిరునామాగా తయారవుతోంది. అపార్ట్‌మెంట్ల పేరుతో ఎత్తైన భవనాల నిర్మాణం పెరిగింది. పదులు, వందల ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలను నిర్మిస్తున్నారు. పురపాలక శాఖ లెక్కల ప్రకారం నగరంలో ఏటా 12 నుంచి 15 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం జరుగుతోంది. ఇవి కాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 9,031 కి.మీ.ల రోడ్డు నెట్‌వర్క్ ఉంది. ఇందులో సుమారు 6,167 కి.మీ.లు సిమెంట్ రహదారులే. దీనికి అదనంగా ఏటా మరో 495 కి.మీ వరకు కొత్త రోడ్లు వేస్తున్నారు. ఒకవైపు భవనాలు.. మరోవైపు రోడ్లు.. ఇతర నిర్మాణాలు నగరాన్ని కాంక్రీట్‌తో కప్పేస్తున్నాయి. పగలు వేడిని తనలో ఇనుమడింపజేసుకునే కాంక్రీట్ ఉపరితలం.. రాత్రి వేళ అదే వేడిని విడుదల చేస్తూ నగరాన్ని హాట్ ఐలాండ్‌గా (నిప్పులు కక్కే ద్వీపం)గా మార్చి వేస్తోంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 లెక్కల ప్రకారం.. హైదరాబాద్ నగర విస్తీర్ణంలో పచ్చదనం 12.9 శాతమే ఉంది. మెట్రోపాలిటిన్ ప్రాంతంలో ఇది 24.68 శాతం వరకు ఉంది. అంటే, 86 శాతం భూభాగం కాంక్రీట్ జంగిల్‌గా మారింది.
దిద్దుబాటు చర్యలు చేపట్టాలి
దీనిపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే, నగరంలో కేవలం కొన్ని పార్కులు ఏర్పాటు చేయడం సరిపోదని, వాటిని పరస్పరం అనుసంధానించేలా గ్రీన్ కారిడార్లు, అర్బన్ ఫారెస్టుల ఏర్పాటు, డివైడర్ల వెంట చెట్ల వరుసలు, నీటి వనరుల సంరక్షణ అవసరమని సూచిస్తున్నారు. పురపాలకశాఖ పట్టణ ప్రణాళికలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. చెరువుల పరిరక్షణ, పెద్ద ఎత్తున చెట్ల పెంపకం, భవనాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉండేలా చూడటం, వేడిని తక్కువగా గ్రహించే నిర్మాణ సామగ్రి వినియోగం ద్వారా ఉష్ణోగ్రతలను కట్టడి చేయవచ్చని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుందని హితవు పలుకుతున్నారు.
ఇవీ చదవండి:
విదేశీ బీఎఫ్‌ఎస్ఐ కంపెనీల ‘జీసీసీ’ హవా
భూమి ఓచోట...రిజిస్ట్రేషన్లు మరోచోట...!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News