మురుగునీరు శుద్ధిచేసి.. మళ్లీ మురుగులోకే!
ABN , Publish Date - Nov 27 , 2026 | 08:08 AM
నాగోల్‌లోని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లో రోజుకు 110 నుంచి 120 మిలియన్ లీటర్ల మురుగునీటిని సాధారణ రంగులోకి వచ్చేలా శుద్ధి చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నాగోల్‌లోని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లో రోజుకు 110 నుంచి 120 మిలియన్ లీటర్ల మురుగునీటిని సాధారణ రంగులోకి వచ్చేలా శుద్ధి చేస్తున్నారు. వివిధ దశల్లో మురుగును, వ్యర్థాలను వేరుచేసి శుద్ధి చేసిన ఆ నీటిని మళ్లీ మూసీ మురుగులోకే వదిలేస్తుండడంతో వ్యయం, శ్రమ నిష్ప్రయోజనంగా మారుతున్నాయి. శుద్ధి చేసిన నీటిలో కేవలం ఒక శాతం మాత్రమే వినియోగిస్తున్నారు. అంబర్‌పేట, అత్తాపూర్, ఉప్పల్ నల్లచెరువు, కోకాపేట, దుర్గంచెరువు, హుస్సేన్‌సాగర్ తీరాన గల ఎస్టీపీల వద్ద కూడా అదే పరిస్థితి.
నీటి శుద్ధి ఇలా..
నాగోల్‌లో రోజుకు 320 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసేలా ఏడాదిన్నర క్రితం ఎస్టీపీని నిర్మించారు. ఇక్కడకు ఎల్‌బీనగర్, వనస్థలిపురం, నాగోల్ పరిసర ప్రాంతాల నుంచి ప్రతీ రోజు 110-120 మిలియన్ లీటర్ల మురుగు వస్తుంది. మురుగు నీరంతా సంపులోకి రాగానే ప్రిలిమినరీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో తొలుత వ్యర్థాలను వేరు చేసి, ఆ తర్వాత సీక్వెన్సీ బ్యాచ్ రియాక్టర్‌కు తరలిస్తున్నారు. అందులో ఆక్సిజన్ ద్వారా మురుగు నీటిలోని సూక్ష్మ జీవుల సేంద్రీయ పదార్థాన్ని (బీఓడీ), ఇతర మలినాలను విచ్ఛిన్నం చేస్తారు.
శుద్ధి చేసి.. మూసీలోకి వదిలేస్తూ..
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ప్రతీరోజు 1950 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో దాదాపు 1,727 మిలియన్ లీటర్ల మురుగునీటిని 43 ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నారు. మురుగునీటిలో 90శాతం వరకు శుద్ధి చేస్తున్నారు. తాగునీటిని శుద్ధి చేసేందుకు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో ఏయే పద్ధతులను అవలంబిస్తారో.. అవే పద్ధతులను మురుగునీటి ఎస్టీపీలలోనూ వినియోగిస్తారు. దాంతో ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీరు వాసన కూడా రాకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటిని వివిధ ఫ్యాక్టరీల అవసరాలకు, గార్డెనింగ్, తోటలు, పంటలకు కూడా వినియోగించవచ్చు. నిర్మాణ రంగానికి క్యూరింగ్‌లో కూడా వాడవచ్చు. తాగేందుకు, ఆహార పదార్థాల్లో కలిపేందుకు మినహా ఇతర ఏ అవసరాలకైనా వినియోగించడానికి అనువుగా ఎస్టీపీల శుద్ధి చేసిన నీరు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ శుద్ధి చేసిన నీటిని తిరిగి మూసీ నదిలోకే వదులుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్