Share News

ఐఆర్‌సీ సదస్సులో తెలంగాణ వంటకాలు

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:24 AM

హైటెక్స్‌ వేదికగా జరగబోయే ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) 85వ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తోంది.

ఐఆర్‌సీ సదస్సులో తెలంగాణ వంటకాలు
IRC 2026 Hyderabad

  • హలీమ్‌, పాయా, హైదరాబాదీ ధమ్‌ బిర్యానీ

  • నాటుకోడి పులుసు.. రాగిసంగటి స్పెషల్‌

  • 4,100 మందికి భోజనాల కోసం ఏర్పాట్లు

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): హైటెక్స్‌ వేదికగా జరగబోయే ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) 85వ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 4,100 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. వీరిందరికీ తెలంగాణ ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. వీటితోపాటు ఉత్తర, దక్షిణ భారతీయ వంటకాలు మెనూలో ఉంటాయి. హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ, హలీమ్‌, పాయా, పత్తర్‌ కా గోష్‌, తెలంగాణ మటన్‌ కర్రీ, రాగి సంగటి-నాటు కోడి పులుసు మొదలైన వాటిని వడ్డించనున్నారు.


మాంసాహారంతోపాటు శాఖాహార వంటకాలను అతిథులకు అందుబాటులో ఉంచుతారు. మరోవైపు, ఐఆర్‌సీ సదస్సుకు వచ్చే ప్రతినిధులు, అతిథుల కోసం హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్లలో గదులను బుక్‌ చేయనున్నారు. మొత్తం 1,250 గదులు అవసరమని అంచనా వేయగా ఇప్పటికే 34 హోటళ్లలో 1,069 గదులు బుక్‌ చేశారు. సదస్సు వేదిక వద్దకు అతిథులను తీసుకెళ్లి తీసుకురావటం కోసం 1180 వాహనాలను సమకూర్చనున్నారు. కాగా ఈ సదస్సు కోసం సుమారు రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. సదస్సు నిర్వహణ కోసం ఆర్‌ అండ్‌ బీ ఒక లోగోను రూపొందించింది. ఒకవైపు నూతన హైకోర్టు భవనం,మరోవైపు చార్మినార్‌.. మధ్యలో సచివాలయ భవనం, తెలంగాణతల్లి విగ్రహం.. వీటన్నింటిని కలిపే రహదారులతో లోగోను డిజైన్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:24 AM