స్నాప్‌చాట్‌లో ఆర్డర్లు.. క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు.. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా గుట్టురట్టు
ABN , Publish Date - Nov 18 , 2026 | 03:45 PM
స్నాప్‌చాట్ ద్వారా ఆర్డర్లు , క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు చెల్లింపులు.. హైదరాబాద్ కేంద్రంగా జోరుగా కొనసాగుతున్న గంజాయి దందాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ నార్కోటిక్స్‌తో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా జోరుగా సాగుతున్న డ్రగ్స్, గంజాయి రవాణా, విక్రయాల దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బస్సుల్లో ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి.. కుష్, గంజాయిని విక్రయిస్తున్న డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేయగా.. ముంబైకు చెందిన ప్రధాన నిందితుడు, డ్రగ్స్ సరఫరాదారు షేక్ ఫరహాన్ పరారయ్యాడు. స్నాప్‌చాట్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. కాగా.. నిందితుల నుంచి 1.240 కేజీల గంజాయి, 16.59 గ్రాముల కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్, గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం మేరకు ఈగల్ ఫోర్స్.. హైదరాబాద్ నార్కోటిక్స్‌తో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఈ దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ముంబై నుంచి డ్రగ్స్‌ను బస్సుల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. OGdude420, Dude OG 420 పేర్లతో.. స్నాప్‌చాట్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని.. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. USDT, RedotPay ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలు కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు.
స్నాప్‌చాట్ ద్వారా నిందితులు గతంలోనూ డ్రగ్స్ దందా చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి అకౌంట్లను గుర్తించి బ్లాక్ చేయడంతో.. మరో కొత్త అకౌంట్ ద్వారా ఈ దందాకు మరల తెర లేపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో ఒకరైన హైదరాబాద్ డ్రగ్స్ పెడ్లర్ ఇద్రిస్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2021-22లో బెంగళూరు NCB కేసు, 2025 డిసెంబర్‌లో RGIA విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టుబడిన ఇద్రిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై వచ్చిన తరువాత కూడా డ్రగ్స్ దందానే కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. కాగా.. పరారీలో ఉన్న ముంబైకు చెందిన సరఫరాదారుడు షేక్ ఫరహాన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. క్రిప్టో వాలెట్ లావాదేవీలపై ఈగల్‌ఫోర్స్ లోతుగా దర్యాప్తు చేపట్టింది. దీని ద్వారా డ్రగ్స్ సరఫరాదారులు, కొనుగోలుదారుల మధ్య గల ఆర్థిక లింకులపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించింది. అక్రమ డ్రగ్స్ వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్ము ఎక్కడ అనే కోణంలో కేసును దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మీ పిల్లలపై నిఘా పెట్టండి: ఈగల్ ఫోర్స్
ఈ నేపథ్యంలో ఈగల్ ఫోర్స్ ప్రజలకు.. తమ పిల్లలపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేసింది. డ్రగ్స్ సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ ఫోర్స్‌కు తెలియజేయాలని కోరింది. తల్లిదండ్రులు పిల్లలపై, వారి స్నేహితులపై, వారి అలవాట్లపై నిఘా పెట్టాలని సూచించింది. ఈ మేరకు యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. డ్రగ్స్ సమాచారం తెలియజేయాల్సిన నంబర్లు: ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్: 87126 71111, ఈ-మెయిల్: tsnabho-hyd@tspolice.gov.in. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, విశ్వసనీయ సమాచారం అందించిన వారికి తగిన బహుమతి అందిస్తామని ప్రకటించింది.