Share News

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏటీఎం వద్ద కాపు కాచి..

ABN , Publish Date - Jan 31 , 2026 | 08:21 AM

హైదరాబాద్‌లో ఓ వ్యక్తిపై కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం ఉదయం కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్ వద్ద రిన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏటీఎం వద్ద కాపు కాచి..
Robbery in Hyderabad

హైదరాబాద్, జనవరి 31: హైదరాబాద్‌లో ఓ వ్యక్తిపై కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం ఉదయం కోఠి (Koti)లోని ఎస్‌బీఐ ఏటీఎం (SBI ATM) సెంటర్ వద్ద రిన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.6లక్షలు డిపాజిట్ చేసేందుకు ఈ రోజు ఉదయం రిన్షద్ వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అతడిపై కాల్పులు జరిపి.. ఆ నగదు మొత్తం తీసుకుని పరారయ్యారు.


Koti-ATM.jpgస్థానికుల సమాచారం మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎవరు, ఎంతమంది ఉన్నారనే వివరాలను స్థానికులని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


మరోవైపు.. కాల్పులు జరిపిన దుండగులు బ్లాక్ కలర్ యాక్టీవాపై వచ్చి.. ఈ దోపిడీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. దుండగులు మొత్తం రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు.. ఘటనా స్థలంలో లభ్యమైన రెండు షెల్స్‌ ద్వారా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.


రెక్కీ నిర్వహించి.. రిన్షద్ వాహనంతో పరారీ: డీసీపీ శిల్పవల్లి

కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి రిన్షద్ వచ్చారని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వివరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం డీసీపీ వివరాలను వెల్లడించారు. రిన్షద్‌పై కాల్పులు జరిపి రూ.6లక్షలు దోచుకెళ్లారని తెలిపారు. ఈ రోజు ఉదయం 6.50 నుంచి 7 గంటల మధ్యలో దుండగులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. రిన్షద్ నగదు డిపాజిట్ చేయడం‌పై రెక్కీ నిర్వహించి.. ఈ దాడి చేసినట్లు తెలుస్తోందన్నారు. నాంపల్లిలో రిన్షద్ దుస్తుల వ్యాపారం చేస్తారని చెప్పారు.


ప్రతిరోజు తనకు వచ్చిన కలెక్షన్లను కోఠిలోని ఎస్‌బీఐలోని ఏటీఎంలో అతడు డిపాజిట్ చేస్తాడని తెలిపారు. ఆ క్రమంలో శనివారం ఉదయం రూ.6లక్షలు డిపాజిట్ చేసేందుకు అతడు వచ్చాడన్నారు. అదే సమయంలో దుండగులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. రిన్షద్‌పై కాల్పులు జరపడంతో అతను అక్కడే కుప్పకులిపోయాడని పేర్కొన్నారు. దోచుకున్న నగదుతోపాటు రిన్షద్ బైక్‌తో దుండగులు పరారైయ్యారన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కోసం ఐదు బృందాలతో గాలిస్తున్నామన్నారు. రిన్షద్‌కు ప్రాణాపాయం తప్పిందని స్పష్టం చేశారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండో రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా

For More TG News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 11:56 AM