సైబర్ నేరాలపై సంయుక్త సమరం.. ఇన్‌ఫ్లుయెన్సర్లతో జతకట్టిన పోలీసులు
ABN , Publish Date - Feb 22 , 2026 | 08:42 AM
రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇతర సామాజిక కంటెంట్ క్రియేటర్స్‌తో జతకట్టి సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సిద్ధమయ్యారు.
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 22(ఆంధ్ర జ్యోతి): రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర సామాజిక కంటెంట్ క్రియేటర్స్‌తో జతకట్టి సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సిద్ధమయ్యారు. 'జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్' ప్రచారాన్ని వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. వీటిని హైదరాబాద్ సిటీ పోలీస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో 'కొలాబరేటర్’ చేస్తూ లక్షలాది మందికి చేరవేస్తున్నారు.
నవ్విస్తూనే ఆలోచింపజేస్తున్న వీడియోలు:
ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇటీవల రూపొందించిన వీడియోలు ఎంతో వైవిధ్యంగా ఉంటున్నాయి. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే మరోవైపు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లాటరీ మోసాలపై కళ్లు తెరిపిస్తూ రూపొందించిన 'దేశీ మామ్ వర్సెస్ స్కామర్ కాన్సెప్ట్'తో రూపొందిన వీడియో ప్రాక్టికల్‌గా ఆలోచింపజేస్తోంది. మీకు రూ.25లక్షల లాటరీ తగిలింది. ప్రాసెసింగ్ ఫీజు కోసం ఓటీపీ చెప్పండి.. అంటూ వచ్చే ఫేక్ కాల్స్‌ని ఓ గృహిణి ఎంత చాకచక్యంగా తిప్పికొట్టిందని ఇందులో చూపించారు.
డిజిటల్ అరెస్టుపై కనువిప్పు:
డిజిటల్ అరెస్టు మోసాల గుట్టును మరో వీడియో ద్వారా విప్పారు. సీబీఐ, పోలీస్, ఆర్బీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ యూనిఫామ్స్ ధరించి వీడియో కాల్స్ ద్వారా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపారు. ఫేక్ కాల్స్‌కు భయపడకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు.
బాధ్యతగా ముందుకు రావాలి:
సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యేలా పోలీసులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సంయుక్తంగా చేస్తున్న ఈ ప్రయోగానికి నెటిజన్ల నుంచి అద్భుతమైన మద్దతు, ప్రశంసలు లభిస్తున్నాయి. సైబర్ నేరాల కట్టడికి ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ముందుకు రావాలి. సురక్షితమైన, చైతన్యవంతమైన సమాజ నిర్మాణం మనందరి ఉమ్మడి బాధ్యతని అన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And Telugu News