Share News

మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:22 PM

హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని రూ.52 కోట్ల వ్యయంతో 400 మీట‌ర్ల పొడవుతో నిర్మించగా.. సోమవారం నాడు సీఎం ప్రారంభోత్సవం చేశారు.

మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
Moosarambagh High Level Bridge

హైదరాబాద్: మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని రూ.52 కోట్ల వ్యయంతో 400 మీట‌ర్ల పొడవుతో నిర్మించగా.. సీఎం నేడు (సోమవారం) ప్రారంభోత్సవం చేశారు. మూసీ నదిలో ల‌క్షా యాభై వేల క్యూసెక్కుల వ‌రద వ‌చ్చినా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పటిష్ఠంగా దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జితో అంబ‌ర్‌పేట‌, మూసారాంబాగ్ ప్రాంతాలకు ప్రయాణాలు సులభం కానున్నాయి. ప్రారంభోత్సవం అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..'హైదరాబాద్‌ అతివేగంగా విస్తరిస్తూ విశ్వనగరంగా మారింది. ప్రపంచంతో భాగ్యనగరం పోటీ పడుతోంది. వివిధ రంగాలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ జరగడం లేదు. ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేస్తున్నాం. మూసీ పక్కన నివసించే వారి పరిస్థితి అత్యంత దయనీయం. వరదలు వస్తే ఆ ప్రాంత ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ వంతెన ఎందుకు నిర్మించలేదు. రెండేళ్లలోనే మేము బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశాం. పదేళ్లలో అంబర్‌పేట్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టారా?. ఎక్కడో ఊరి బయట డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. పేదల కష్టాలు మాకు తెలుసు.. అందుకే ఇళ్లు కట్టిస్తున్నాం.


బతుకమ్మకుంటను చెరబట్టింది ఎవరో అందరికీ తెలుసు. నిమజ్జనం చేసేందుకు చెరువు లేకుండా బతుకమ్మకుంటను కబ్జా చేశారు. హైడ్రాను పంపి బతుకమ్మకుంటను చెర నుంచి విడిపించి ఆడబిడ్డలకు బహుమతిగా ఇచ్చాం. అయినా మళ్లీ కబ్జాకు యత్నిస్తున్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్నాం తప్పా.. వాటిల్లో విల్లాలు, ఫామ్‌హౌస్‌లు మేం కట్టుకోలేదు. ప్రజాపాలన ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. ప్రజా ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్రలు చేస్తున్నారు. మా ప్రభుత్వం విఫలమైందని కొందరు విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి చూసి ఆశ్చర్యపోయా. ధనిక రాష్ట్రంగా కేసీఆర్‌కు అప్పగిస్తే అప్పుల కుప్ప చేశారు. పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేసీఆర్‌కు ముందు ఉన్న సీఎంలు చేసిన అప్పు రూ.70 వేల కోట్లు.. కానీ, కేసీఆర్ ఒక్కరే రూ.7.50 లక్షల కోట్ల అప్పు చేశారు. నెలకు రూ.7,500 కోట్ల అసలు, వడ్డీ కడుతున్నాం. ఏడాదికి రూ.80 నుంచి 90 వేల కోట్ల అప్పు కడుతున్నాం.


ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నాం. నెలకు వెయ్యి మంది ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. ఒక్కో ఉద్యోగికి బెనిఫిట్స్‌ కింద రూ.కోటి ఇవ్వాల్సి వస్తోంది. గత 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేశాం. గతంలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 6 నెలలకు ఓసారి వేతనాలు ఇచ్చేవారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. రెండేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు కట్టాం. రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశాం. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజాపాలన అంటే ఇదే' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వ స‌ల‌హాదారు వి.హ‌నుమంత‌రావు, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంక‌టేశ్, శ్రీ గ‌ణేశ్, నవీన్ యాదవ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

Updated Date - Aug 31 , 2026 | 07:15 PM