Share News

చోరీకి గురైన ద్విచక్రవాహనం.. మూడు నెలల తర్వాత ఈ-చలాన్..

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:44 PM

రెహ్మాన్ ద్విచక్రవాహనానికి ఈ-చలాన్ విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెసేజ్ పంపారు. దీంతో షాక్‌కు గురైన అతను వెంటనే అప్రమత్తమయ్యాడు. తన వద్ద స్కూటీ లేదు కదా.. చలానా ఏంటని మెసేజ్ ఓపెన్ చేశాడు.

చోరీకి గురైన ద్విచక్రవాహనం.. మూడు నెలల తర్వాత ఈ-చలాన్..
E-challan on Stolen Bike

హైదరాబాద్: భాగ్యనగరంలో మూడు నెలల కిందట ఫైసల్ రెహ్మాన్ అనే వ్యక్తి ద్విచక్రవాహనం దొంగతనానికి గురైంది. చోరీపై అతను హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ద్విచక్రవాహనం ఎలాగైనా పట్టుకుని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. మూడు నెలలు గడిచినా వాహనం ఆచూకీ మాత్రం లభించలేదు. తాజాగా తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాడు రెహ్మాన్.


రెహ్మాన్ ద్విచక్రవాహనానికి ఈ-చలాన్ విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెసేజ్ పంపారు. దీంతో షాక్‌కు గురైన అతను వెంటనే అప్రమత్తమయ్యాడు. తన వద్ద స్కూటీ లేదు కదా.. చలానా ఏంటని మెసేజ్ ఓపెన్ చేశాడు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్‌కి వెళ్లి చూశాడు. ఆ సైట్‌లో తన ద్విచక్రవాహనంపై దొంగ కూర్చుని ఉన్న స్పష్టమైన ఫొటోను చూశాడు. ఆ ఫొటో ద్వారా నిందితుడిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. దాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహా నగర అధికారులకు ట్యాగ్ చేశాడు. ఈ పోస్టు కాస్తా వైరల్‌గా మారింది. పోలీసులు వేగంగా స్పందించి దొంగను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే తమకు ఎదురైన ఇలాంటి ఘటనలను షేర్ చేస్తున్నారు.


అయితే, రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా చలాన్లు ఆటోమేటిక్‌గా జారీ చేయపడతాయనే విషయం తెలిసిందే. ఆ వాహనం దొంగిలించిందో, లేదో గుర్తించకుండానే.. పోలీసు రికార్డులు తనిఖీ చేయకుండానే చలాన్లు పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చలాన్లు పంపే ముందే వాహనం చోరీకి గురైందో, లేదో ట్రాఫిక్ వ్యవస్థ తనిఖీ చేయాలని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా వాహనాలను త్వరగా కనిపెట్టి యజమానులకు అప్పగించవచ్చని చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు

రైతుల హక్కులకు భంగం వాటిల్లితే సహించబోం.. హైడ్రాకు మంద కృష్ణ మాదిగ వార్నింగ్

Updated Date - Apr 08 , 2026 | 04:49 PM